తూర్పుగోదావరి జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి (ఎల్‌డీఎం)గా ఎస్.శ్రీనివాసరావు కాకినాడలోని కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గుజరాత్‌లోని సూరత్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్‌గా పనిచేసి జిల్లాకు ఎల్‌డీఎంగా వచ్చిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా అమలుచేసేందుకు కృషిచేయనున్నట్లు తెలిపారు. పాలనా యంత్రాంగం, బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా ప్రగతిపథంలో పయనించేలా విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో జిల్లా అభివృద్ధి సాధిస్తోందని, మరింత అభివృద్ధికి బ్యాంకుల నుంచి ప్రోత్సాహం అందేలా చూస్తామన్నారు. జిల్లాలోని గౌరవ ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు తెలిపారు. గతంలో ఎల్‌డీఎంగా పనిచేసిన జె.షణ్ముఖరావు ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేశారు.