కెనడా, టొరొంటోలో ఆగష్ట్ 17 నుంచి 31వరకు జరిగే అంతర్జాతీయ వ్యవసాయ ఆర్ధిక శాస్త్రవేత్తల సదస్సుకు నైరా వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ ఆర్ధికశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్యులు డా.వాన రాజేంద్రప్రసాద్ కు ఆహ్వానం అందినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎ.వి.రమణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు.భారత దేశంలో కోవిడ్ అనంతర నేపధ్యంలో తిరుగువలసలు,సంబంధిత ఆహార భద్రత తద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి డా. రాజేంద్రప్రసాద్ ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళికను ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. రైతులను,ఔత్సాహిక యువతను వ్యవసాయ ఉత్పత్తిదారులను సంఘాలుగా ఏర్పరచి వివిధ కాలాల్లో ఖాళీగా ఉంటున్న వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగులోకి తెచ్చి గ్రామాల్లోని నిరుద్యోగాన్ని పారద్రోలడమే లక్ష్యమని చెప్పారు. తద్వారా సుస్థిర వ్యవసాయాభివృద్ధి, ఆహార మరియు పోషకభద్రతను దేశంలో సాధించవచ్చని డా. వి.రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయ పడినట్లు ఆయన తెలిపారు. సుస్థిర వ్యవసాయాభివృద్ధిపై ఇప్పటికే ఒక జాతీయ వెబినార్,నాబార్డు సహకారంతో రాష్ట్ర స్థాయి దృశ్యమాధ్యమ సదస్సులను నిర్వహించినట్లు అసోసియేట్ డీన్ వివరించారు. పెరుగుతున్న ఆయకట్టు ద్వారా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో సాంధ్ర వ్యవసాయాభివృద్ధి సాధన అనే ప్రోజెక్ట్ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) సంబంధించిన జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి ( ఎన్ఎఎస్ఎఫ్) పరిశీలనలో ఉన్నట్లు తెలియజేసారు. డా. వి.రాజేంద్రప్రసాద్ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికకావడం పట్ల ఆర్ధిక శాస్త్ర విభాగాధిపతి డా. ఎన్.సునంద, బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు హర్షం వ్యక్తం చేసినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.