గుంటూరు నగరానికి చెందిన గృహనిర్మాణ లబ్ధిదారుల కోసం పేరేచర్ల లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లే అవుట్ లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం మేడికొండూరు మండలం, పేరేచర్ల లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లే అవుట్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్, సంయుక్త కలెక్టర్ (గృహ నిర్మాణం) అనుపమ అంజలి, జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణు గోపాలరావు, మున్సిపల్ కమీషనర్ చల్లా అనురాధ లతో కలిసి పరిశీలించారు. మొత్తం 409.01 ఎకరాల స్థలంలో రహదారులను ఏర్పాటు చేసి 18,090 ప్లాట్లుగా విభజించినట్లు గృహనిర్మాణశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.లే అవుట్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ నమూనా ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్రంలో రెండో పెద్ద లే అవుట్ గా ప్రభుత్వం గుర్తించిన పేరేచర్ల లే అవుట్ లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తాడికొండ శాసన సభ్యురాలు శ్రీదేవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్ లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ను కోరారు. లే అవుట్ లో కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతం ఉండటంతో ఆ ప్రాంతాన్ని మెరక చేసేందుకు వెంటనే ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లో లెవల్ మెరకను పెంచేందుకు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా సమీప చెరువులోని మట్టిని వినియోగించుకునేలా అధికారులు ప్రణాళికలను తయారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులు త్వరిత గతిన గృహనిర్మాణ పనులు చేపట్టేలా చూడాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య, గుంటూరు ఆర్.డి.వొ భాస్కర్ రెడ్డి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పి సిఇవొ చతన్య, పంచాయితీరాజ్ ఎస్.ఇ నతానియేల్, మేడికొండూరు తహాశీల్ధార్ కరుణ కుమార్, ఎంపిడివొ ఎం.శోభారాణి, ఏపి ఫైబర్ అధారులు, సచివాలయ సెక్రటరీలు,వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.