ప్రతిపైసా సద్వినియోగం కావాల్సిందే..


Ens Balu
3
Srikakulam
2021-07-07 13:36:17

ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనేంట్ క్రింద వచ్చిన ప్రతి పైసా సద్వినియోగం కావాల్సిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అన్నారు. గ్రామ సచివాయం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రం తదితర భవనాల నిర్మాణం, ప్రగతి పట్ల బుధ వారం మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనేంట్ క్రింద వచ్చిన ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం వంద నుండి 120 కోట్ల రూపాయలను పనులు పూర్తి చేయక నష్టపోతున్నామని కలెక్టర్ తెలిపారు. ఇంజినీరింగ్ సహాయకుల సేవలను పెద్ద ఎత్తున ఉపయోగించాలని ఆయన ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి భవనాలు పూర్తి చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే వారం నాటికి ప్రగతి ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భవనాలకు ఇసుక సమస్య ఉండకుండా అన్ని చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.స్థలం అందజేసినప్పటికి పనులు ప్రారంభించని ఏఇలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పనులు చేస్తూ బిల్లులను జనరేట్ చేయాలని ఆయన ఆదేశించారు. తహశీల్దార్, ఎం.పి.డి.ఓ సమన్వయంతో పనిచేసి అన్ని భవనాల నిర్మాణం ప్రారంభించాలని ఆయన అన్నారు.

 ఒకే గుత్తేదారుకు అన్ని పనులు చేయించడం వల్ల నిర్మాణ పనులు జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. టెక్కలి పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆధ్వర్యంలో జరుగతున్న పనుల్లో  ప్రగతి చాలా తక్కువగా ఉందని కలెక్టర్ అన్నారు. 757 భవనాల పనులు సరాసరిన చేపట్టినప్పటికీ వారానికి రూ.3. కోట్లు ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రారంభం కాని పనులపై సమీక్షించాలని టెక్కలి సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. కంచిలి, సోంపేట, కోటబొమ్మాళి, పొందూరు, వీరఘట్టం మండలాలలో నిర్మాణాల ప్రగతి అతి తక్కువగా ఉందని ఆయన అన్నారు. పొందూరులో 84 భవనాలకు కేవలం 40 భవనాల నిర్మాణం మాత్రమే ప్రారంభించడాన్ని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. తక్షణం మిగిలిన 44 పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వారం సమీక్షిస్తామని, ప్రగతి లేని అధికారులపై  చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత గుర్తించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రాధాన్యతని ఇస్తున్నారని ఆయన వివరించారు. ప్రతి చోట కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలని, ప్రజలకు అవగాహన కలిగించాలని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు నాయుడు, అర్.డి.ఓ ఐ.కిశోర్,  జిల్లా పరిషత్ సీఈఓ బి. లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి. రవి కుమార్, ఆర్ అండ్ బి ఎస్.ఇ కె.కాంతిమతి, పంచాయతీ రాజ్ ఎస్.ఇ బ్రహ్మయ్య తదితులు పాల్గొన్నారు.