మహిళరైతుల ఆర్ధిక పురోగతికి ‘జగనన్న పాల వెల్లువ’ పధకం ఎంతగానో ఉప యోగపడుతుందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, లింగారావు పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు విడదల రజని, సంయుక్త కలెక్టర్(రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జె.పి. వెంకటేశ్వర్లు, డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద నాయక్, గురజాల రెవెన్యూ డివిజన్, నరసరావుపేట ఇన్ చార్జ్ ఆర్.డి.వొ పార్ధసారధిలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలను కల్పించి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఎక్కువగా మహిళల పేరున అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మహిళా రైతులు పాడి పరిశ్రమాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా రైతుల ఆర్థికాభివృద్ధి కోసం జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. వ్యవసాయంలో ఆదాయం సీజన్ బట్టి వస్తుందనీ, పాడి పరిశ్రమలో నిరంతర ఆదాయం రైతు కుటుంబాలకు వచ్చే అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం పశుసంపదను రుణాల రూపంలో అందిస్తుందని తెలిపారు. మహిళలు ఉత్సాహంతో పని చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమం విజయానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. గతంలో కో - ఆపరేటివ్ సొసైటిల ద్వారా పాడి పరిశ్రమ డైయిరీలు కొనసాగేవని, కొన్ని కారణాల వలన ఆ డైయిరీలు కొనసాగించలేదన్నారు. గుజరాత్ లో అమూల్ సంస్థ ఏర్పాటుకు మహిళలు కృషి చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ఏపిలో కూడా మహిళలు ఒక కమిటీగా ఏర్పడి నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసి లాభాలను గడించాలని కోరారు. డైయిరీ వ్యవస్థలకు జీవం పోసేందుకు జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళలకు పుష్కలంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడదల రజని మాట్లాడుతూ ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమంలో అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ ప్రభుత్వమే చేస్తుందని తెలిపారు. ప్రతీ పధకంలో మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారన్నారు. ఆసరా, చేయూత, ఇళ్ళ స్థలాలు, అమ్మవడి వంటి పధకాలను ఎక్కువగా అక్కచెల్లెలమ్మలకే అవకాశం కల్పించారని కొనియాడారు. తోటి మహిళగా ప్రభుత్వం చేపట్టిన మహిళా సంక్షేమ పధకాలను చూసి గర్వపడుతున్నానని అన్నారు. ఆటోమెషన్ పద్ధతిలో మహిళలు తెచ్చిన పాలను అమూల్ సంస్థ నాణ్యతను పరిశీలించి అధిక మొత్తంలో నగదును చెల్లిస్తుందని తెలిపారు. నాదెండ్ల మండలంలో నలుగురు రైతులతో నేరుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయతతో మాట్లాడిన తీరును ఎప్పటికీ మరువబోనని గుర్తుచేశారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పధకాలన్నింటిలో మహిళలకు అత్యుత్తమ అవకాశాలను కల్పించడం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందన్నారు. పాడి పరిశ్రమను నమ్ముకున్న ప్రతీ ఒక్క మహిళ రైతుకు అండగా ముందుండి నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.
సంయుక్త కలెక్టర్( రైతుభరోసా – రెవెన్యూ) దినేష్ కుమార్ మాట్లాడుతూ ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమం ద్వారా మహిళా రైతులందరికీ మేలు జరుగుతుందని అన్నారు. మహిళలు ఆర్ధికంగా లబ్ధిపొందేందుకు జగనన్న పాల వెల్లువ పధకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా రైతుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. మహిళా పాడి రైతులంతా ఒక కమిటీగా ఏర్పడి పశువుల నుంచి వచ్చే నాణ్యమైన పాలను అమూల్ పాల కేంద్రాలలో లాభసాటిగా అమ్ముకోవచ్చునన్నారు. మహిళా రైతులు ఉత్పత్తి చేసిన పాల ధరలను మహిళా సంఘ కమిటీలే నిర్ణయించుకునే వీలుందని అన్నారు. ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా మహిళలకు రుణాలను ఇప్పించి, పశువులను కొనుగోలు చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. అమూల్ కేంద్రాలకు పాలు పోస్తున్న ప్రతీ మహిళా రైతు జవాబుదారీతనంతో పని చేసి పారదర్శకంగా అభివృద్ధిని సాధించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది, సంక్షేమ పధకాలను ప్రతీ మహిళ ఉపయోగించుకోవాలని సంయుక్త కలెక్టర్ కోరారు.
సభాకార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు విడదల రజని, సంయుక్త కలెక్టర్(రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి లింగారావు పాలెంలో ఇంటింటికి వెళ్ళి జగనన్న పాల వెల్లువ కార్యక్రమం కరపత్రాలను అందించి, ఈ పధకం వల్ల కలిగే వివరించడం జరిగింది. అనంతరం వెటర్నరీ ఆసుపత్రిలో గోపూజ నిర్వహించారు. మహిళా రైతులకు పశుదాణా, మినరల్ మిక్చర్ ను పంపిణీ చేశారు. సమావేశంలో మైనార్టీ సంక్షేమశాఖ అధికారి మస్తాన్ షరీఫ్, లింగాపురం గ్రామ సర్పంచ్ కరీమ్, తహాశీల్ధార్ శ్రీనివాసరావు, ఎమ్పిడివొ మాధవి తదితరులు పాల్గొన్నారు.