విపత్తుల నిర్వహణకు నూతన పద్ధతులు..
Ens Balu
3
తిరుమల
2021-07-07 14:17:50
తిరుమలలో ప్రమాదాల నివారణకు ఆధునిక పద్ధతులు అమలు చేయడంలో భాగంగా గ్యాస్ ట్యాంకర్లను మోల్డెడ్ స్ట్రక్చర్లలో ఉంచే విధానం అవలంబించాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన చాంబర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గ్యాస్ నిల్వ ఉంచడం వల్ల ప్రమాదాలను అరికట్టడం, తీవ్రతను తగ్గించడం గురించి డిప్యూటి చీఫ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్ ఈవో కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఈవో మాట్లాడుతూ తిరుమలలో గ్యాస్ ట్యాంకర్ల ను నిల్వ ఉంచే పద్ధతుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రమాదం జరిగినపుడు ప్రజలు, ఉద్యోగులు ఎలా స్పందించాలనే అంశం మీద మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. గృహ, వ్యాపార అవసరాలకు గ్యాస్ వినియోగించే వారికి కూడా అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని ఈవో సూచించారు. అధికారులతో సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.అదనపు ఈవో ధర్మారెడ్డి, సివిఎస్వోగోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.