కోవిడ్ థర్డ్ వేవ్ పై కొవ్వొత్తుల ర్యాలీ..


Ens Balu
3
Srikakulam
2021-07-07 15:14:13

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరంలోని ఏడురోడ్ల కూడలి నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు కోవిడ్ థర్డ్ వేవ్ పై కొవ్వొత్తుల అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని కొవ్వొత్తుల ర్యాలీనకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మాస్కులను ధరిస్తూ సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్ లేదా సబ్బుతో తరచూ శుభ్రపరచుకోవడం వలన కరోనా నివారించవచ్చని చెప్పారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ మరియు సెకెండ్ వేవ్ లలో ప్రజలు పూర్తిగా సహకరించి కరోనా నియంత్రణకు ఏ విధంగా సహకరించారో అదేవిధంగా రానున్న థర్డవేవ్ లో కూడా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను నియంత్రించాలని సూచించారు. జిల్లాలో కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టిందని అందులో భాగంగా ప్రతీ ఒక్కరికీ వేక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. మొదటి దశలో 60 ఏళ్లకు పైబడిన వారికి, రెండవ దశలో 45 నుండి 60 ఏళ్లు గల వారికి టీకాలు వేయడం జరిగిందని, అలాగే గర్భిణీ స్త్రీలకు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ వేక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తుచేసారు. జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి వేక్సిన్లు వేశామన్నారు.

 టీకాల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, టీకాల సరఫరాలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరస్తుందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ పేషెంట్లకు వైద్య సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. మెగా టీకా కార్యక్రమంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, అలాగే రాష్ట్రంలోనే అతి ఎక్కువ టీకాలు వేసిన జిల్లాల్లో శ్రీకాకుళం ముందంజలో ఉందన్నారు. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు సహకారంతోనే దానిని నివారించగలమని గుర్తుచేసారు. కోవిడ్ థర్ఢ్ వేవ్ రాకుండా ప్రతీ ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ ఎప్పటికపుడు శానిటైజేషన్ చేసుకోవాలని  జె.సి నగర ప్రజలకు పిలుపునిచ్చారు.

         ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, మెప్మా పథక సంచాలకులు యం.కిరణ్ కుమార్, జగన్మోహన్ రావు, నగరపాలక సంస్థ ప్రజా ఆరోగ్య అధికారి డా. వెంకటరావు, అర్బన్ హెల్త్ క్లినిక్ డా. జె.కృష్ణమోహన్ , టెక్కలి అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లీల, ఇతర అధికారులు , ఆశావర్కర్లు, ఎ.ఎన్.ఎంలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.