ఆర్గానిక్ ఉత్పత్తులే మానవాళికి ఆరోగ్యం..


Ens Balu
3
Vizianagaram
2021-07-07 15:25:01

ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌తో ప‌రిపూర్ణ ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ సూచించారు. పూర్తిగా ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేస్తున్న జిల్లాగా విజ‌య‌న‌గ‌రం మారాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై జిల్లా స్థాయి క‌న్వ‌ర్జెన్సీ స‌మావేశం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో బుధ‌వారం జ‌రిగింది. జిల్లాలో ప్ర‌స్తుతం ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ప‌రిస్థితి, విస్త‌ర‌ణ‌కు ఉన్న అవ‌కాశాలు, ల‌క్ష్యాలు, దీనివ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను, జిల్లా ప్ర‌కృతి వ్య‌వ‌సాయం స‌హాయ సంచాల‌కులు ప్ర‌కాష్ ముందుగా ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ చేశారు.  అనంత‌రం క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, ప్ర‌తీవ్య‌క్తీ వందేళ్లు బ్ర‌త‌కాలంటే, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌ను తిన‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను వినియోగించి, విజ‌య‌న‌గ‌రం జిల్లా ప్ర‌జ‌లు శ‌తాయుష్షును పొందాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే మొట్ట‌మొద‌టి సంపూర్ణ ప్ర‌కృతి సేద్య‌పు జిల్లాగా విజ‌య‌న‌గ‌రం మారాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. దీనికి జిల్లాలో పూర్తి అవ‌కాశాలు, త‌గిన వాతావ‌ర‌ణ, భౌగోలిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని అన్నారు. ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త‌, ప‌రిపూర్ణ ఆరోగ్యం త‌మ ప్ర‌ధాన ల‌క్ష్యాల‌ని, ప‌రిపూర్ణ ఆరోగ్యానికి ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ఏకైక మార్గ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

            మ‌న‌సుపెట్టి ప‌నిచేస్తే, దేనినైనా సాధించ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ అన్నారు.  ప్ర‌తీ ప్ర‌భుత్వ శాఖా, త‌మ ప‌రిధిలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని ఆదేశించారు. దీనికి స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేయాల‌ని సూచించారు. ముఖ్యంగా గిరిజ‌న ప్రాంతంలో దృష్టి కేంద్రీక‌రించాల‌ని, ఉద్యాన పంట‌ల‌ను కూడా ప్ర‌కృతి సేద్యంతో సాగు చేయాల‌ని కోరారు. ఆర్‌బికేలు కేంద్ర‌దంగా రైతుల‌కు విస్తృతంగా అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌న్నారు. మ‌న ముఖ్య‌మంత్రి ఆదేశాల ప్ర‌కారం, ప్ర‌తీనెలా మొద‌టి శుక్ర‌వారం గ్రామ‌స్థాయిలో, రెండో శుక్ర‌వారం మండ‌ల స్థాయిలో, మూడో శుక్ర‌వారం జిల్లా స్థాయిలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. దీనికోసం స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తోపాటు, గ్రామ స్వ‌యం స‌హాయ‌క సంఘాల సేవ‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

             ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ, రైతు భ‌రోసా) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, వ్య‌వ‌సాయ‌వాఖ జెడి ఎం.ఆశాదేవి, సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌లు, ఇత‌ర శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.