శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి చెందిన వరాహ పుష్కరణి ని అందరి సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు
ఆలయ ఏఈవో నక్కాన ఆనంద్ కుమార్ అన్నారు. గురువారం వరాహ పుష్కరిణీ ప్రాంగణంలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ ప్రాంత వైద్యులు సంక్షేమ సంఘం(అర్ఎంపీ )ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వరాహ పుష్కరిణి అభివృద్ధికి ఆలయ ఈఓ సూర్యకళ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. గౌరవ అతిథిగా హాజరైన అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, వరాహ పుష్కరిణి ని పర్యావరణ ప్రాంతం గా తీర్చి దిద్దాలని ఈఓని తాను ఇప్పటికే కోరామని పేర్కొన్నారు. పుష్కరిణి అభివృద్ధికి దేవస్థానం పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. భక్తులు తొలుత ఈ వరాహ పుష్కరణీ లో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాతే సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అటువంటి పుష్కరణిని అందంగా తీర్చిదిద్దితే భక్తులతో పాటు స్థానిక పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ సేద తీరే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంఘము జోషి,కార్యదర్శి లోగిశ గణేషు మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే తమకు మేలు చేసే విధంగా జీవో ఇచ్చారని గుర్తుచేశారు. చాలా మంది అర్ఎంపీ వైద్యులుకి ఆ జీవో ద్వారా మేలు జరిగిందన్నారు.అనంతరం వైస్సార్ కి ఘనంగా నివాళులు అర్పించారు. సంఘం ప్రతినిధులు, దేవస్థానం అధికారి ముద్దాడ వెంకట రమణ,సంఘం ఇంచార్జి ఆకుల శ్రీనివాస్,ప్రెసిడెంట్ బాల శశంకర రావు, కళ, రంగారావు,పూర్ణ,పద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.