యుద్ధప్రాతిపదికన పనులు పూర్తికావాలి..


Ens Balu
3
Srikakulam
2021-07-08 14:19:33

ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేకూరేలా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో వై.యస్.ఆర్.జగనన్న శాస్వత భూహక్కు , భూరక్ష , డిజిటల్ లైబ్రరీలు, గృహ పట్టాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వై.యస్.ఆర్. జగనన్న శాస్వత భూహక్కు మరియు భూరక్ష పథకానికి సంబంధించి శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి  రెవిన్యూ డివిజనల్ పరిధిల్లో రీ సర్వే చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని పోలాకి మండలం సంతలక్ష్మీపురం, కోటబొమ్మాళి మండలంలోని ఆనందపురం, పాలకొండ మండలంలోని పరశురాంపురం ప్రాంతాల్లో రీసర్వే పనులపై ఆరా తీసిన ఆయన అందుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. మధ్య తరగతి వారికి అందజేస్తున్న గృహ పట్టాలను త్వరితగతిన భూమిని సేకరించాలని, సేకరించిన భూమి  అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు వచ్చి స్వయంగా స్వీకరించే విధంగా  ఆ స్థలం ఉండేలా చూడాలన్నారు. 90 రోజుల్లో పట్టాలకు సంబంధించి మాట్లాడుతూ పట్టాల పంపిణీకి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు ప్రింటింగ్ వేగవంతం చేయాలని చెప్పారు. జగనన్న కాలనీ లేఔట్లు గురించి మాట్లాడుతూ లేఔట్లకు సంబంధించి ఏవైతే కోర్టు కేసులు పెండింగులో ఉన్నాయో వాటిపై దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ న్యాయవాదులతో మాట్లాడి ఆ కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. లేఔట్లు సిద్ధంగా ఉంటే లబ్ధిదారులకు అందజేసేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. జిల్లాలో గల 15 మండలాల్లో 178 డిజిటల్ లైబ్రరీలకు ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, వీటికి సంబంధించి ఒక్కో డిజిటల్ లైబ్రరీకి ఐదు సెంట్లు చొప్పున స్థలాన్ని సేకరించి త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక అందించాలని చెప్పారు. రైతులకు రుణకార్డుల ద్వారా రుణాలను మంజూరుచేయాలని, యల్.డి.ఎంతో మాట్లాడి  గతంలో రైతు భరోసా నిధులు  ఏ ఖాతాల్లో పడ్డాయో ఆ ఖాతాల్లో రైతులకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) హిమాంశు కౌశిక్, టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, శ్రీకాకుళం, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిశోర్, టి.వి.ఎస్.జి.కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.