విజయనగరం కార్పొరేషన్‌కు సమీపంలో మెడికల్ హబ్స్ ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. పట్టణానికి రెండుమూడు కిలోమీటర్ల దూరంలోనే, ఒక్కొక్కటి 3 నుంచి 5 ఎకరాలు చొప్పున, కనీసం ఐదారు ప్రాంతాలను ఎంపిక చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్‌కు సమీపంలో మెడికల్ హబ్స్‌ను ఏర్పాటు చేసి, వివిధ రకాల సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికోసం శుక్రవారం సాయంత్రానికి స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. వేక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, 45 ఏళ్లు పైబడిన ప్రతీఒక్కరికీ వేక్సినేషన్‌ను పూర్తి అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. కోవిడ్ పరీక్షలను విస్తృతం చేయాలని, రోజుకు 4వేల నుంచి 5వేల వరకూ టెస్టులను నిర్వహించాలని చెప్పారు. పార్వతీపురంలో వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
కరోనా మూడోదశపై అన్ని విభాగాలూ అప్రమత్తంగా ఉండటంతోపాటుగా, కోవిడ్ నిబంధనలపై మరింత విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. దీనికోసం ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల టాస్క్‌లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ సోమవారం నో మాస్క్-నో ఎంట్రీ, మంగళవారం నోమాస్క్-నో రైడ్, బుధవారం నో మాస్క్-నో బిజినెస్ అన్న అంశాలను ప్రచారం చేయాలని సూచించారు. అర్బన్ క్లీనిక్కుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని, వైద్య సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కోవిడ్ కారణంగా తల్లితండ్రులిద్దరినీ కోల్పోయి అనాధలైన పిల్లలను గుర్తించి, వారికి ప్రభుత్వం నుంచి పరిహారాన్ని ఇప్పించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, డిఐఓ డాక్టర్ గోపాలకృష్ణ, పిఓ డిటిటి డాక్టర్ బాలమురళీకృష్ణ, డిపిఆర్ఓ డి.రమేష్, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.