చెత్త రహిత నగరానికి సహకరించండి..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-08 15:25:03

మహా విశాఖనగరం మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారమే ముఖ్య భూమికని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన అన్నారు. గురువారం ఆమె 4వ జోన్ 30వ వార్డు పరిధిలోని కొత్త జాలారి పేట, రెల్లివీధి మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని “డస్ట్ బిన్ ఫ్రీ సిటీ” గా తీర్చిదిద్దేందుకు ప్రజల సహాయ సహకారాలు అవసరమన్నారు. రోడ్డు అడ్డంగా ఉన్న ఇంటి నిర్మాణ సామగ్రిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. వార్డులలో సరిపడే పారిశుధ్య సిబ్బంది ఉన్నారని,  పిన్ పాయింట్ వారిగా కార్మికులను సర్దుబాటు చేసి, ఎవరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త అధికంగా ఉందని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారి నుండి అపరాధ రుసుము వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్లును ఆదేశించారు. ప్రతి రోజూ చెత్త తరలించే వాహనాలు డిప్లోయ్మెంట్ ప్రకారం వస్తున్నాయా అని శానిటరీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు ఇంటింటికి వచ్చి తడి-పొడి చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజుల్లో డస్ట్ బిన్లను, లిట్టర్ బిన్లను తొలగిస్తామని ప్రతి ఇంటికి మూడు రంగుల చెత్త డబ్బాలు ఇవ్వడం జరుగుతుందని, వాటితో తడి-పొడి మరియు ప్రమాదకరమైన చెత్తగా విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ప్రజలకు సూచించారు. ప్రతి దుకాణం ముందు మూడు రంగుల చెత్త డబ్బాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వీధి లైట్లు వెలగడం లేదని స్థానిక ప్రజలు తెలుపగా సాయంత్రం లోగా వీధి లైట్లు వెలిగించాలని సహాయక ఇంజినీరు(ఎలక్ట్రికల్)ను ఆదేశించారు.  
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, పి.శ్రీనివాస రావు, గణేష్ కుమార్, వెటర్నరి  డాక్టరు కిషోర్, సహాయక ఇంజినీరు విల్సన్, ఎస్.ఎస్. శ్రీనివాస రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నాజీ, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.