శ్రీకాకుళంను సుందర నగరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ప్రతి పౌరుని లక్ష్యం కావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని పెదపాడు చెరువును, నాగావళి నదిలో నిర్మిస్తున్న డైక్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. చెరువు మంచి పర్యాటక ఆకర్షణ కాగలదని, సుందరంగా తయారు చేయడం వలన నగరానికి మరింత శోభ చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. మన ఊరు మన చెరువు కార్యక్రమం కింద పెదపాడు చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని ఆయన చెప్పారు. విభిన్న ఏజెన్సీలు కాకుండా ఒకే ఏజెన్సీ పనులను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పనులు పూర్తి చేయుటకు నిర్దిష్ట గడువు కచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ముందుగా చెరువు సరిహద్దులను గుర్తించాలని వాటికి మార్కింగ్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేయాలని దానితో పాటుగా సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇరువైపులా మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలని ఆయన అన్నారు. పెద్దపాడు గ్రామంలోనూ, చెరువు చుట్టుపక్కల ఎక్కడ బహిరంగ మలవిసర్జన ఉండకుండా అన్ని చర్యలు చేపట్టాలని గ్రామ సర్పంచ్ కలగ శ్రీనివాస్ కు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద మరుగుదొడ్లు ఉన్నాయని, వాటిని విధిగా వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం నీటి సరఫరా లేనప్పుడు ఇంటివద్ద నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకుని తద్వారా వినియోగించాలి ఆయన పేర్కొన్నారు. గ్రామ, నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణం తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రవర్తనా పరమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచిస్తూ బహిరంగ మల విసర్జనకు పూర్తిగా నిలుపుదల చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. నగరపాలక అధికారులు తెలవారుతుండగానే రహదారులపై ఉండాలని ఆయన ఆదేశించారు. పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అనేక చోట్ల చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని తద్వారా నగర పారిశుద్ధ్యానికి, ఆహ్లాదానికీ, సుందరీకరణకు ఆటంకంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. ప్రత్యేక అధికారి హోదాలో నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను వ్యక్తిగతంగా తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు.
డైక్ త్వరగా పూర్తి చేయాలి: నాగావళి నదిలో నిర్మిస్తున్న డైక్ ను అతి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణం తీవ్ర జాప్యం అయిందని ఆయన పేర్కొన్నారు. వర్షాలకు ముందే వీలైనంత ఎక్కువ పనులను చేపట్టాలని ఆయన చెప్పారు. నగరంలో రివర్ ఫ్రంట్ పార్క్ ఉండటం వలన మరింత శోభ చేకూరుతుందని ఆయన అన్నారు. నగరంలో చేపడుతున్న పనులపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమల రావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. ఓబులేసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు అధికారి హెచ్. కూర్మా రావు, ప్రజారోగ్య కార్యనిర్వాహక ఇంజనీర్ పి.సుగుణాకర రావు, నగరపాలక ఇంజనీర్ రమణ మూర్తి, ప్రజారోగ్య శాఖ డిఇ దక్షిణామూర్తి, తాహసిల్దార్ వై.వి.ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.