రూ.60 లక్షల పరికరాలు వితరణ..
Ens Balu
2
Srikakulam
2021-07-09 12:39:16
శ్రీకాకుళంజిల్లాలో కోవిడ్ సెకెండ్ వేవ్ నుండి ప్రస్తుతం బయటపడ్డామని, చాలావరకు కేసులు తగ్గుముఖం పట్టాయని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సుమారు రూ.60 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, హెచ్.ఎఫ్.ఎన్.సిలు, ఐసియు పారా మానిటర్లు, ఎన్ – 95 మాస్కులు, శానిటైజర్లను డా. రెడ్డీస్ ల్యాబ్ జిల్లా కలెక్టర్ కు అందజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెకెండ్ వేవ్ నుండి బయటపడినప్పటికీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు వార్తలు కూడా వచ్చాయని, ఇటువంటి తరుణంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద కొన్ని పరికరాలను అందజేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా పైడి భీమవరంలోని డా. రెడ్డీస్ ల్యాబ్ ముందుకువచ్చి దాదాపు రూ.60 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, హెచ్.ఎఫ్.ఎన్.సిలు, ఐసియు పారా మానిటర్లు, ఎన్ – 95 మాస్కులు, శానిటైజర్లను ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు జిల్లాలోని మూడు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను ( నిమిషానికి 200 లీటర్లు సామర్ధ్యం ) నెలకొల్పబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే రూ.25 లక్షలతో రణస్థలం వద్ద ఆక్సిజన్ ప్లాంటును నెలకొల్పడం జరిగిందని, త్వరలో పాలకొండ, రాజాం ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇవేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన పరికరాలు, జిల్లాలో స్వంతంగా కొనుగోలు చేసి కొన్ని పరికరాలను సిద్ధం చేసామని చెప్పారు. వీటితో జిల్లాలో థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకువెళ్లే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేసారు. రూ.60 లక్షల విలువైన పరికరాలను అందజేసిన డా. రెడ్డీస్ ల్యాబ్ కు అభినందనలు తెలిపిన కలెక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తరపున పరికరాలు ఇచ్చేందుకు కృషిచేసిన ఎచ్చెర్ల ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్ ను కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, డా. రెడ్డీస్ ల్యాబ్ సీనియర్ డైరక్టర్ కె.వి.యస్.ఎన్.రాజు, అసోసియేట్ డైరక్టర్ వి.ఆర్.జోగారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి.సుమన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.