ప్రతీరోజు 200 గృహాలు గ్రౌండింగ్ జరగాలి..


Ens Balu
3
Srikakulam
2021-07-09 12:45:22

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతీ మండలంలో రోజుకి 200 గృహాలు గ్రౌండింగ్ కావాలని గృహనిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్ గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంపై గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ జిల్లాలో 92 వేలు గృహాలు గ్రౌండింగ్ కావలసి ఉండగా ఇప్పటివరకు 69 వేలు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. ఈ నెల 1,2 మరియు 4వ తేదీలలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 92 వేలు గృహాలకు గ్రౌండింగ్ జరగాల్సిఉండగా 69 వేలు మాత్రమే గ్రౌండింగ్ కావడంపై జె.సి అసంతృప్తి వ్యక్తం చేశారు.   హౌసింగ్ గ్రౌండింగ్ వెనుకబడి ఉండటం వలన రాష్ట్రస్థాయిలో జిల్లా 11వ స్థానానికి చేరుకుందని అన్నారు. కావున గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జె.సి సూచించారు. ప్రతి మండలంలో రోజుకి 200 గృహాలు గ్రౌండింగ్ అయితేనే లక్ష్యాన్ని సాధించగలమని జె.సి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ ఇంజినీర్లు, మండల తహసీల్దారు, ఎం.పి.డి.ఓలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకొని లక్ష్యాన్ని అధిగమించాలని అధికారులను జె.సి ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.