రాష్ట్రంలోని పల్లెలన్నీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ముందుచూపుతో ప్రగతిబాటలో పయనిస్తున్నాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన శుక్రవారం జిల్లాలోని టెక్కలి డివిజన్ పరిధిలోగల టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా టెక్కలిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.75 లక్షలతో నిర్మించిన, కార్పొరేట్ బ్యాంకులకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉన్న పలు విభాగాలను అతిథులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇచ్చాపురం టౌన్ 15వ వార్డ్ బెల్లుపడ వద్ద రూ.80 లక్షలతో నిర్మించే హాస్పటల్ కు శంఖుస్థాపన చేశారు. ఇచ్చాపురం టౌన్ లో 1వ వార్డ్ లో రూ. 80 లక్షలతో నిర్మించే అర్బన్ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేసారు. ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో రూ1.84 కోట్లతో నిర్మాణం కానున్న పబ్లిక్ హెల్త్ సెంటర్ హాస్పిటలకు శంఖుస్థాపన చేశారు. ఈదుపురం గ్రామంలో డిసిసిబి బ్యాంకు శాఖని ప్రారంభించారు. అక్కడే 1.84 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతోందని అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి, సంక్షేమ బాటలో నడిపించిన చరితార్థుడని అన్నారు. తండ్రి వారసుడిగా, ఆయన ఆశయాలే ఊపిరిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు. రైతులను సీఎం జగన్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. పంట దిగుబడి తగ్గితే బీమా వచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చడానికి ప్రభుత్వం విశేషకృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ప్రజలు ఇచ్చిన వినతులను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వీకరించారు. ఇచ్చాపురంలో తాగునీటి సమస్య, సోంపేట థర్మల్ విద్యుత్ వ్యతిరేక పోరాటంలో కేసులు నమోదు చేసిన 725 మందిపై కేసులు ఎత్తివేయాలని, వారిలో చాలామంది విద్యార్థులు ఉండటం కారణంగా వారి భవిష్యత్తుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వీటి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమాలలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, డిసిఎంఎస్ అద్యక్షులు పిరియా సాయిరాజ్,మున్సిపల్ ఛైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు ఉలాల విజయభారతి, తహశీల్దార్ మురళి, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, స్థానిక నాయకులు నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా(లల్లూ), సర్తు సరేంద్ర, పిరియా విజయ, నిమ్మన దాసు, కడియాల ప్రకాశ్, దువ్వు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.