చైతన్య యాత్రలతో రైతులకు అవగాహన..


Ens Balu
3
Guntur
2021-07-09 12:51:45

చైతన్య యాత్రల ద్వారా రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు.  9 -7- 2021 నుంచి 23 -7- 2021 వరకు డాక్టర్ వైయస్ ఆర్ రైతు భరోసా పై రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్తు ఎదురుగా ఉన్న కృషిభవన్ ఆవరణలో డాక్టర్ వైయస్ ఆర్ రైతు భరోసా చైతన్య వాహన యాత్రలను సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పెదకూరపాడు, ప్రతిపాడు, పెదకాకాని, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల్లో క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ ,మార్కెటింగ్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించామన్నారు. గ్రామాలలో రైతుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు పై శాఖల అధికారులు, సిబ్బంది వాహనాలను ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించేందుకు విలేజ్ అసిస్టెంట్స్, మండల అధికారులు, వ్యవసాయ క్షేత్ర అధికారులు రైతుల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ పద్ధతిని లాభసాటిగా ఉండేవిధంగా ప్రదర్శన చేయాలన్నారు. రైతులు పండించిన పంటకు మార్కెట్ లో అధిక ధరలు వచ్చేవిధంగా చూడాలన్నారు. వరి ని ఎక్కువగా రైతులు పండించడం వలన ఆ పంట మార్కెట్ కు వచ్చేసరికి ధర తగ్గుతుందనే అపోహ రైతుల్లో ఉందన్నారు. అలాంటి అపోహాలకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆర్బికె గ్రామాల పరిధిలోని వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాల్సిన వరి వంగడాల లక్షణాలు తట్టుకునే చీడ, పీడల గురించి అవగాహన కల్పిచాలన్నారు. నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో బోర్లకింద ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. రైతులు తప్పని సరిగా అధీకృత డీలర్ల దగ్గర విత్తనాలు కొనుగోలు చేయాలని, సదరు రశీదును పంటకాలం పూర్తి అయ్యేవరకు భద్ర పరుచుకోవాలని, అనధికార విత్తన విక్రయాల సమాచారమును రైతులు తక్షణమే స్థానిక వ్యవసాయ, పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. యంత్ర సేవ కేంద్రాలు  ఆర్బికె పరిధిలో రైతు సంఘాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కస్టమ్ హైరింగ్ కేంద్రాల వివరాలను రైతులకు తెలయజేయాలన్నారు. ఈ క్రాఫ్ అప్లికేషన్స్ వారి గ్రామాల్లో పండించే అన్ని వ్యవసాయ ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుగ్రాస, సామాజిక అటవీశాఖ, మత్స్యశాఖలకు సంబంధించిన  సర్వేనంబర్ల విస్తీర్ణం రైతు వివరాలతో సమోదు చేస్తారన్నారు. ఈ క్రాఫ్ లో నమోదు కాబడిన రైతుల వివరాలను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. పెట్టుబడిని తగ్గించి సమగ్ర పంటల విధానంలో నాణ్యమైన అధిక దిగుబడిని సాధించాలని రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి, ఉప సంచాలకులు ఐ. మురళి, పి. రామాంజనేయులు. సహాయ సంచాలకులు కె.వి. శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.