విశాఖ పోర్టు నుంచి వెలువడే కాలుష్య నివారణకు చర్యలు చేపట్టినట్టు జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె నాలుగవ జోన్ 39 వ వార్డు కోట వీధి పరిసర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, వార్డు కార్పొరేటర్ డా. మహమ్మద్ సాధిక్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ విశాఖ పోర్ట్ ట్రస్ట్ కు చెందిన భారీ వాహనాల వలన శబ్ద, వాయు కాలుష్యం అధికంగా ఉందని, భారీ వాహనాలు ఎక్కువగా తిరగడం వలన రోడ్డులు, భూగర్భ పైపులు ద్వంసం అవుతున్నాయని, పోర్టు భారీ వాహనాలకు మరో మార్గం ద్వారా పంపించేందుకు పోర్ట్ చైర్మన్ తో మాట్లాడతామని తెలిపారు. పాత పోస్టాఫీసు బస్సులు ఆగు ప్రదేశంలో ప్రయాణీకులకు మరుగుదొడ్లు సదుపాయం లేదని, వాటిని వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కాలువలలో పూడికలు తొలగించనందుకు వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే పూడికలు తీయించాలని ఆదేశించారు. భూగర్భ మురుగు కొరకు తీసిన గోయ్యలను కాంక్రీటు తో పూడ్చి , ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఇపిడిసిఎల్ వార్డు భూగర్భ ఎలక్ట్రికల్ పైపులను బయటకు వదలి ఆ గోయ్యలును పూడ్చనందుకు ఇపిడిసిఎల్ వారికి నోటీసు ఇచ్చి, వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను అదేశించారు. డోర్ టు డోర్ చెత్త సేకరించే పద్దతిని స్థానిక ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. భూగర్భ మురుగు నీటిలో ఎటువంటి వ్యర్ధ పదార్ధాలు, నేప్కిన్స్, డ్రైపర్సు వేయరాదని సూచించారు. స్థానిక చేపల బజారులో చెత్త బుట్టలు ఏర్పాటు చేయాలని ప్రధాన వైధ్యాధికారిని ఆదేశించారు.
సెయింట్ జాన్ హై స్కూలు(హెరిటేజ్ బిల్డింగు) శిధిలావస్థలో ఉందని, దానిని తొలగించి నూతనంగా బిల్డింగు నిర్మించాలని, టిడ్కో ఇళ్ళ నిర్మాణ పనులు ఇంకా మొదలు పెట్ట లేదని, స్థానిక సచివాలయం మార్పుచేయాలని, ఫేరీ రోడ్డులో ఉన్న అంగన్వాడి కేంద్రంలో విద్యుత్ దీపాలు లేవని, ఆ ప్రాంతంలో ఉన్న పార్కుకు మరమత్తులు చేయించాలని కార్పొరేటర్ తెలపగా, మేయర్, కమిషనర్ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాద రాజు, కార్య నిర్వహాక ఇంజినీర్లు గణేష్ బాబు, శ్రీనివాస రావు, చిరంజీవి, ఎఎంఒహెచ్ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.