విరివిగా పారిశుధ్య పనులు జరగాలి..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-09 13:02:24

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అన్నివార్డుల్లో పారిశుద్ధ్య పనులను విధిగా నిర్వర్తించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటరీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన 6వ జోన్ 69 వ వార్డు పరిధిలోని కాపు తుంగ్లాం, రెడ్డి తుంగ్లాం, ఎస్సీ కాలనీ, బి.హెచ్.పి.వి. తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్త సేకరించాలని,  కాలువలను, రోడ్లను శుభ్రంచేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చూడాలని, చెత్త వేసిన వారిపై నిఘా ఉంచి వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని, యూజర్ చార్జీలు యాప్ ద్వారా వసూలు చేయాలని, లిట్టర్ బిన్లు శుభ్రపరచాలని, కాలువలలోనూ, లిట్టర్ బిన్ల చుట్టూ బ్లీచింగ్ జల్లించాలని, చెత్తను వెంట వెంటనే డంపింగ్ యార్డుకు తరలించాలని, శానిటరీ ఇన్స్పెక్టరును, వార్డు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి రోజు చెత్త సేకరణకు వస్తున్నారా లేదా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులైన  మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ పర్యటనలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.