గ్రామస్థాయిలో ఆధార్ సేవలు పెరగాలి..


Ens Balu
3
Guntur
2021-07-09 13:04:50

గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను అనుసంధానం చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ సిబ్బంది విధి నిర్వహణలో మరింత బాధ్యతతో పని చేయాలని సంయుక్త కలెక్టర్( సచివాలయం–అభివృద్ధి) పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లోని  సంయుక్త కలెక్టర్(సచివాలయం – అభివృద్ధి) పి.ప్రశాంతి ఛాంబర్ లో గ్రామ/వార్డు సచివాలయాల జిల్లా కో- ఆర్ఢినేటర్, డిజిటల్ అసిస్టెంట్ లకు 22 ఆధార్ నమోదు పరికరాలు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ గతంలో మీసేవా కేంద్రాల ద్వారా ఆధార్ లో దొర్లిన తప్పులను సరి చేయడం. ఫోన్ నంబర్లు అనుసంధానం, పేర్లు మార్పులు, చేర్పులు చేయడానికి నిర్వాహకుల తీరుతో ప్రజలు అవస్థలు పడేవారన్నారు. అటువంటి సమస్యలను అధిగమించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లోనే ఆధార్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయించడం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం సచివాలయాల్లో గ్రామ/వార్డు వాలటీర్లు చేస్తున్న పనులతో పాటు  ఆధార్ సమస్యల పరిష్కారం కోసం అదనపు డిజిటల్ సిబ్బందిని నియమించి తగిన శిక్షణను ఇచ్చి వారికి ఆధార్ నమోదు పరికరాలు(కంప్యూటర్ల) ను అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 31 మండల కేంద్రాల సచివాలయాలకు ఆధార్ కేంద్రాలను  ఏర్పాటు చేసి  31 ఆధార్ నమోదు పరికరాలు (కంప్యూటర్ల) ను కేటాయించామన్నారు. వాటిలో 9 కేంద్రాలకు  ఆధార్ నమోదు పరికరాలు గతంలోనే అందించామని, రెండో దఫా  22 ఆధార్ నమోదు పరికరాలు డిజిటల్ సిబ్బందికి ఈ రోజు అందిచినట్లు తెలిపారు. ప్రతీ ఒక్క డిజిటల్ అసిస్టెంట్  బాధ్యతతో పనిచేసి ఆన్ లైన్ లో ప్రజల ఆధార్ సమస్యలను పరిష్కరించాలని  పేర్కొన్నారు. ఎటువంటి ఫిర్యాదులు రాకుండా డిజిటల్ సిబ్బంది పని చేయాలని  సంయుక్త కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఆధార్ నమోదులో వస్తున్న సమస్యలను సకాలంలో గుర్తించడంతో పాటుగా వాటిని  పరిష్కరించేందుకు ప్రజలు తగిన దృవీకరణ  పత్రాలను చూపిన తరువాతే వాటిని అను సంధానం చేసి  సమస్యను పరిష్కరించాలన్నారు. గతంలో ఆధార్ నమోదు కేంద్రాలలో ప్రజల  సమస్యలను పరిష్కరించేందుకు డిజిటల్ సిబ్బంది స్వప్రయోజనాలకు ఆశపడి ఇబ్బందులు పాలు అయ్యారని గుర్తుచేశారు. అటువంటి వాటి జోలికి పోకుండా నిబద్ధతతో డిజిటల్ అసిస్టెంట్ లు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ/వార్డు సచివాలయాల  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జిల్లా కో ఆర్డినేటర్, డిజిటల్ అసిస్టెంట్స్, సచివాలయాల డిజిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.