ఎస్సీల నిధులు వారికే ఖర్చుచేయాలి..
Ens Balu
4
Vizianagaram
2021-07-09 13:36:25
విజయనగరం జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన నిధులను, వారి సంక్షేమం కోసం ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ శాఖ, ఎస్‌సిల కోసం తమ బడ్జెట్‌లో తప్పనిసరిగా 17.08 శాతానికి తగ్గకుండా నిధులను ఖర్చుచేయాల్సిందేనని స్పష్టం చేశారు. కేటాయించిన నిధులను ఖర్చుచేయని శాఖలు, ఇకనుంచీ ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించి, వారి సంక్షేమం కోసం కృషి చేయాలని కలెక్టర్ కోరారు. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక అమలుపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ముందుగా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు కె.సునీల్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ, ఉప ప్రణాళిక లక్ష్యాలను వివరించారు. వివిధ శాఖలు ప్రణాళిక అమలులో భాగంగా తీసుకున్న చర్యలను చదివి వినిపిచారు. ప్రభుత్వ శాఖలన్నీ ఎస్‌సిల కోసం వెచ్చిస్తున్న నిధులు, సాధించిన లక్ష్యాలను తెలుసుకున్నారు. ఎస్‌సిలకు లబ్ది చేకూర్చిన ఫొటోలను, పూర్తి వివరాలను, మండలాల వారీగా జాబితాలను నెలనెలా తమశాఖకు నివేదించాలని సూచించారు. ప్రతీ ప్రభుత్వ శాఖ, తప్పనిసరిగా ఎస్‌సిలకు కేటాయించిన నిధులను ఖర్చు చేసి, వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, సిపిఓ జె.విజయలక్ష్మి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధరావు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, డుమా పిడి ఏ.నాగేశ్వర్రావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, మెప్మా పిడి సుధాకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ శివానందకుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.