విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని పలు గ్రామ సచివాలయాలను జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మండలంలోని కొటారుబిల్లి, రామవరం, నరవ గ్రామ సచివాలయాల్లో జె.సి.(ఆసరా) తనిఖీలు నిర్వహించి సిబ్బంది హాజరును పరిశీలించారు. ఉద్యోగులు అందిస్తున్న సేవలు తెలుసుకొని ఉద్యోగి వారీగా సంక్షేమ పథకాలు అమలుపై ఆరా తీశారు. వై.ఎస్.ఆర్.బీమా, చేయూత తదితర సంక్షేమ పథకాల అమలు, సచివాలయాల ద్వారా ఇ-సేవల కోసం వచ్చిన వినతుల పరిష్కారం, స్పందన వినతుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. సచివాలయ సిబ్బంది కార్యాలయ వేళల్లో తప్పనిసరిగా కార్యాలయంలో అందుబాటులో వుండాలని స్పష్టం చేశారు. సచివాలయం నుంచి బయటకు వెళ్లాల్సి వుంటే మూవ్ మెంట్ రిజిష్టరులో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో జి.ఎస్.నిర్మలాదేవి కూడా పాల్గొన్నారు.