హౌసింగ్ పనులు వేగవంతం చేయాలి..
Ens Balu
2
Kakinada
2021-07-10 11:12:15
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం సంబంధించి గ్రౌండింగ్ పూర్తి అయిన ప్రతి ఇల్లు వివరాలు ఆన్ లైన్లో పెండింగ్ లేకుండా సక్రమంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో హౌసింగ్ కు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆన్ లైన్లో వివరాల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి స్వయంగా పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొలిదశలో 1లక్ష , 28వేల ఇళ్ళు నిర్మించేందుకు గానూ ఈ నెల 1, 3 ,4 తేదీలలో మెగా గ్రౌండ్ నిర్వహించడం జరిగింది అన్నారు. దీనిద్వారా లక్ష్యంగా నిర్దేశించిన 40 వేల ఇళ్ళుకు గాను దాదాపుగా 56వేల ఇళ్ళు గ్రౌడింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిఉన్న లబ్ధిదారులను ప్రోత్సహించి గ్రౌండ్ జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన మెటీరియల్ కొరత రానీవకుండా సకాలంలో అందించడం జరుగుతుందన్నారు. కాకినాడ గ్రామీణ మండలానికి సంబంధించి తొలిదశలో సుమారుగా 9,600 ఇళ్లు నిర్మాణం చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పీ.నారాయణమూర్తి, తహసిల్దార్ వీ.మురళీకృష్ణ, హౌసింగ్ ఏఈ శ్రీనివాసు, డీఇ గుప్త, ఇతర అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.