పచ్చదనంతో హరితవనం మెరుగుపడాలి..


Ens Balu
3
Srikakulam
2021-07-10 13:08:18

శ్రీకాకుళం జిల్లా మొత్తం పచ్చదనం పెంపొందించి హరిత వనం మెరుగుపరచాలని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. జగనన్న హరిత వన హారం కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామం నుండి కలివరం గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాసన సభ స్పీకర్ శని వారం ప్రారంభించారు. శాసన సభ స్పీకర్ సతీమణి మరియు తొగరాం గ్రామ సర్పంచ్ వాణి సీతారాం కూడా కార్యక్రమంలో పాల్గొని వెయ్యి మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటారు. హరిత వన హరం కార్యక్రమాన్ని ఆమదాలవలస మండలంలో పెద్ద ఎత్తున చేపట్టి మండలంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలివరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేస్తున్నామన్నారు. ఈ విధంగా నాశనం చేయడం వలన భావితరాలకు మనుగడ లేకుండ పోతుందని ఆయన పేర్కొన్నారు. మంచి వాతావరణం ఉండుటకు పచ్చని చెట్లు ఎంతో దోహదం చేస్తాయని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందని పర్యావసానంగా అనేక అనర్ధాలు కలుగుతున్నాయని గ్రహించాలని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, భూగర్భజలాలు ఎండిపోయే పరిస్ధితులు వస్తున్నాయని, వాతావరణంలో కాలుష్య ప్రభావం పెరుగుతోందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక చెట్టు నాటాలని పిలుపునిచ్చారు. రహదారులకు ఇరువైపులా అశోక చక్రవర్తి మొక్కలు నాటారని చదివామని వాటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటుందో రహదారిపై నడుస్తుంటే తెలుస్తుందని ఆయన వివరించారు. భావితరాలకు మంచి వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉందని ఆయన స్పష్టం చేసారు. మంచి గాలి, నీరు, వాతావరణం భావితరాలకు అందిస్తే సకల సంపదలు అందించినట్లేనని ఆయన అన్నారు. కాలుష్యకారకాలు పెరిగిపోతూ అనేక వ్యాధులు దాపురిస్తున్నాయని స్పీకర్ చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో పచ్చదనం ఆవశ్యకతను ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గుర్తించారని, హరిత వన హారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారని అన్నారు. మొక్కలు నాటుటకు ఇది మంచి తరుణం అన్నారు. గ్రామాల్లో ప్రతి వ్యక్తికి చెట్లతో ఎంతో అనుబంధం ఉంటుందని అందరూ ముందుకు వచ్చి గ్రామాలను హరిత వనాలుగా మార్పు చేయాలని సూచించారు.

          ఈ కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్.కూర్మారావు, అటవీ రేంజ్ అధికారి సింధు, డిప్యూటి రేంజ్ అధికారి జగదీష్, సర్పంచులు మెట్ట నాగజ్యోతి, సురేష్, స్ధానిక నాయకులు తమ్మినేని శ్రీరామమూర్తి, బెండి గోవింద రావు, బెడ్డేపల్లి నారాయణ రావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, తిర్లంగి రామారావు, తదితరులు పాల్గొన్నారు.