1483కేసులకు లోక్అదాలత్ పరిష్కారం..
Ens Balu
2
Vizianagaram
2021-07-10 14:35:27
రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వున్న కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయ్యిందని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. ఈ లోక్ అదాలత్‌కు కక్షిదారుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. జిల్లాలోని జిల్లా కేంద్ర న్యాయస్థానం సహా తొమ్మిది చోట్ల నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1493 కేసులు రాజీ ద్వారా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఇరు పక్షాల సమ్మతితో ఈ కేసుల పరిష్కరించడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి వర్చ్యువల్ విధానంలో లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. కక్షిదారులు, పోలీసు, ఎక్సయిజ్, రెవిన్యూ తదితర ప్రభుత్వ శాఖల సహాయంతో ఈ లోక్ అదాలత్ విజయవంతం అయ్యిందని పేర్కొంటూ వారందరికీ జిల్లా జడ్జి ధన్యవాదాలు తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో తనతో పాటు పార్వతీపురంలోని రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి కె.రాజగోపాల్, కుటుంబ న్యాయస్థానం జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి, సీనియర్ సివిల్ జడ్జి వి.లక్ష్మీరాజ్యం, సీనియర్ సివిల్ జడ్జి జె.శ్రీనివాసరావు, బొబ్బిలిలోని సీనియర్ సివిల్ జడ్జి ఎం.మంగకుమారి, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.శిరీష జిల్లాలోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ లు పాల్గొని లోక్ అదాలత్ ను విజయవంతం చేశారని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో విజయనగరంలో 500, పార్వతీపురంలో 138, బొబ్బిలో 226, సాలూరులో 314, ఎస్.కోటలో 53, గజపతినగరంలో 68, చీపురుపల్లిలో 129, కొత్తవలసలో 22, కురుపాంలో 18 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు.