గుంటూరు జిల్లాలో అత్యాధునిక వైద్య సేవలు అందించే హెల్త్ హబ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు అనువైన ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను గుర్తించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను కోరారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఏ.పి.ఐ.ఏ.సి మేనేజింగ్ డైరెక్టర్ మరియు కమిషనర్ జే.వి.ఎన్. సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ది ) పి. ప్రశాంతి లతో కలసి లా పరిశోధన కేంద్రం, మంగళగిరి వద్ద వున్న ఎయిమ్స్ పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములను పరిశీలించారు. మొదట తాడికొండ మండలం లాం పరిశోధన కేంద్రంలో వున్న ఐదు ఎకరాలు, తాడేపల్లి మండలం వడ్డేశ్వరం పరిధిలో వున్న 4.46 ఎకరాలను పరిశీలించడం జరిగింది. లాం పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్తలు, డాక్టర్లతో అందుబాటులో వున్న స్థల లభ్యతపై మాట్లాడారు. వడ్డేశ్వరం గ్రామ శివారు ప్రాంతం ఎయిమ్స్ కు సమీపంలో వున్న భూములను పరిశీలించారు. ఈ ప్రాంతంలో లభ్యత వున్న స్థలాలను, అందుబాటులో వున్న వనరులు, వసతులను గుర్తించి వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, తాడికొండ తహశీల్దారు కుటుంబరావు, తాడేపల్లి తహశీల్దారు శ్రీనివాస రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సెక్రెటరీ లు పాల్గొన్నారు.