మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని చెత్త తరలించే వాహనాలు సమయపాలన పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం 3వ జోన్ 23వ వార్డు పరిధిలోని మద్దిలపాలెం పరిసర ప్రాంతాలలో జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్ తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త తరలించే వాహనాలు నిర్దేశించిన సమయానికి వచ్చి చెత్తను తరలించాలని, డంపర్ బిన్ల చుట్టూ చెత్త వేయకుండా స్థానికలకు అవగాహన కల్పించాలని, డోర్ టు డోర్ చెత్త ప్రతీ రోజూ సేకరించాలని, తడి-పొడి మరియు ప్రమాదకరమైన చెత్తగా ప్రజలే విభజించి ఇచ్చేలా వారికి అవగాహన కల్పించాలని, కాలువలు, రోడ్డ్లను శుభ్రపరచాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అనంతరం సీజనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా తీసుకొనే చర్యలపై మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో పూల కుండీలు, ఇంటిలో వాడే నీటి కుండీలు, కొబ్బరి బొండాలు, ఫ్రిడ్జ్ వెనుక భాగంలో నీటినిల్వలు ఉండకుండా చూడాలని, ఇంటిలో వాడే నీటిపై మూతలు అమర్చాలని, వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించాలని, ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ పర్యటనలో మూడవ జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.