కరోనా థర్డ్ వేవ్ కు సర్వం సిద్ధం..


Ens Balu
3
Srikakulam
2021-07-12 16:58:08

శ్రీకాకుళంజిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అందించిన సహకారంతో కరోనా మొదటి దశ, రెండవ దశలను పూర్తిస్థాయిలో అధిగమించామని, ఇదేస్థాయిలో రానున్న థర్డ్ వేవ్ ను కూడా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కరోనా థర్డ్ వేవ్ పై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ  కరోనా మొదటి రెండు దశల్లో ఆసుపత్రుల్లో తలెత్తిన కొన్ని విషయాలను గమనించడం జరిగిందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్ వస్తే అందుకు తగిన విధంగా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మునుపటి కంటే అదనంగా బెడ్స్, ఐసియు బెడ్స్, పిడియాట్రిక్ బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ జనరేషన్ వంటి వాటిపై ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, చిన్నపిల్లల వైద్యులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. వీటితో పాటు జిల్లాలో సెకెండ్ వేవ్ లో సర్వీస్ ఉపయోగించుకున్న 20 ప్రైవేటు ఆసుపత్రులలోని సౌకర్యాలను కూడా  పెంచమని ఆదేశించడం జరిగిందని అన్నారు. ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసియు బెడ్స్, పిడియాట్రిక్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ జనరేషన్ వంటి వాటిని గతంలో కంటే  పెంచాలని, ఈ విషయమై గత సమావేశంలో ఆదేశించామని చెప్పారు. అలాగే ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గతంలో కంటే కెపాసిటీని పెంపుదల చేయమని కోరడం జరిగిందని, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలలో విఫలమైన ఆసుపత్రులపై చర్యలు కూడా తీసుకోమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. అయితే అటువంటి పరిస్థితి జిల్లాలో లేదని ప్రతీ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం  జిల్లా యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఇంకా కొన్ని ఆసుపత్రులలో చిన్న చిన్న పనులు చేయాల్సి ఉందని, అటువంటి ఆసుపత్రులను చర్యలపై నోడల్ అధికారులు స్వయంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యల వలన థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా కాబోతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు.