శ్రీకాకుళం జిల్లాలో రైతులు లాభదాయక సాగు విధానాల దిశగా సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. రైతు చైతన్య యాత్రలో భాగంగా మంగళ వారం వీరఘట్టాం మండలం రేగులపాడు తదితర గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ రైతులు లాభదాయక వ్యవసాయాన్ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయక విధానాలలో వెళ్ళడం వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. అధిక దిగుబడులు సాధించాలని అదే సమయంలో వ్యయం తక్కువగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు ఎక్కువ దిగుబడి తక్కువగా ఉండటం వలన రైతులు ఇబ్బందులు పడే పరిస్ధితి ఉంటుందని చెప్పారు. ప్రతి రైతు ఆనందంగా ఉండాలని, రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు లేనిదే మనుషులకు మనుగడ లేదని ఆయన పేర్కొన్నారు. రైతులు యాంత్రీకరణ దిశగా అడుగులు వేయాలని పిలుపునిస్తూ ప్రభుత్వం వై.యస్.ఆర్ యంత్ర సేవ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు అందుబాటులో యంత్రాలను తీసుకువచ్చిందని వివరించారు.
మన ప్రాంతానికి అనువైన వంగడాలను గుర్తించి వేసుకోవాలని, అంతర పంటల వినియోగంపై అవగాహన పొందాలని ఆయన కోరారు. బొప్పాయి వంటి ఉద్యానవన పంటలు లాభాలను ఆర్జించి పెట్టగలవని సూచించారు. పంటలను కేవలం పండింటే ఉద్దేశంతో కాకుండా వాటి లాభదాయకత, మార్కెటింగుపైన అవగాహన పొందాలని అన్నారు. చేపల పెంపకం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందని వ్యవసాయంతోపాటు ఇతర అంశాలను కూడా గమనించాలని చెప్పారు. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసిన అముల్ ప్రాజెక్టుకు పాల విక్రయం ద్వారా మంచ ధల లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు పాల ఉత్పాదనపై ప్రత్యేక దృష్టి సారించి అధిక ఆదాయాన్ని పొందుతున్న తీరును వివరించారు.
ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను (ఆర్.బి.కె) ఏర్పాటు చేసిందని తద్వారా ఉత్తనం నుండి విక్రయం వరకు అవసరమగు సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఆర్.బి.కెలలో ధృవీకరించిన విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మెట్ట భూముల్లో సైతం అపరాలను పండించుటకు ఆరుతడి పండలను వేయసుకోవాలని చెప్పారు. పంట వేసే సమయంలో రైతు – నాణ్యమైన విత్తనాలను కొనుగోళు చేయాలని, కొనుగోళు చేసిన విత్తనాలకు విధిగా రశీదు పొందాలని సూచించారు. విత్తన శుద్ధి జరగాలని, భూసార పరీక్షలు ఆధారంగా ఎరువులు వినియోగించాలని శ్రీకేష్ లాఠకర్ చెప్పారు. సేంద్రియ ఎరువలు వినియోగం వలన భూసారం పెరుగుతుందని అన్నారు. భూముల సారం అనుగుణంగా పచ్చి రొట్ట ఎరువులు, ఇతర ఎరువులను వినియోగించాలని చెప్పారు.
పంట ఎదుగుదలకు 16 రకాల పోషకాలు అవసరమని, అవి సరైన మోతాదులో ఉన్నదీ లేనిది పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. పంట సాగుదారు పత్రం (సి.ఆర్.సి)లను జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ చెప్పారు. ఈ పత్రం ఆధారంగా రైతు భరోసా సహయం అందుతుందని అన్నారు. రైతులు ఇ – క్రాప్ లో నమోదు చేసుకోవాలని తద్వారా ఉచిత పంటల బీమాతోపాటు ఇతర ప్రభుత్వ సహాయక కార్యక్రమాల ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. వై.యస్.ఆర్ పొలంబడి కార్యక్రమం క్రింద వ్యవసాయ అధికారుల సాంకేతిక సలహాలు పొందాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, తహశీల్దారు అప్పారావు స్ధానిక అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.