థర్డ్ వేవ్ ఎదుర్కోడానికి సమాయత్తం ..


Ens Balu
3
Vizianagaram
2021-07-13 10:55:33

మొదటి, రెండవ దశలలో చూసిన కోవిడ్  అనుభవాలతో మూడవ దశ ను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి జిల్లా  యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.  దానికి తగ్గట్టుగా అంచనాలు వేస్తూ కార్యాచరణ ప్రణాళికలను తయారు చేశామన్నారు.  మంగళవారం కలక్టరేట్  వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో  థర్డ్ వేవ్ కోవిడ్  కార్యాచరణ  పై  జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ తో కలసి పాత్రికేయుల సమావేశం లో  కలెక్టర్ మాట్లాడారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోడానికి అవసరమైన  వైద్యులు, నర్స్ లు, పారా  మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందని,  అదే విధంగా వైద్య పరికరాలను, బెడ్స్ , వెంటిలేటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కూడా సిద్ధం చేయడం జరిగిందన్నారు.   ఇప్పటికే థర్డ్ వేవ్  వస్తే ఎలా పని చేయాలనే అంశాల పై జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ సభ్య్యులకు తగు మార్గ దర్శకాలను నిర్దేశించడం జరిగిందన్నారు.  కోవిడ్  నిబంధనలు ప్రతి ఒక్కరు  పాటించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.  ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, కనీసం 2 మీటర్ల భౌతిక దూరాన్ని పాటించాలని, చేతులను సబ్బుతో తరచుగా కడుక్కోవాలని, లేదా సనిటైజర్  వాడాలని  పాత్రికేయులు ఈ విషయాల ను ప్రజలకు అర్ధమయ్యేలా  ప్రచురించాలని అన్నారు. 
మొదటి దశ కోవిడ్ లో 5.68 శాతం  పోజిటివిటి   నమోదు కాగా రెండవ దశ లో 10 శాతం నమోదైందని,  అదే విధంగా మరణాలు మొదటి సారి  0.50 శాతం నమోదు ఆయితే   రెండవ సారి  1.09 శాతంగా నమోదయ్యాయని అన్నారు.  మూడవ దశ లో సున్నా మరణాలే లక్ష్యంగా  చేసుకొని కార్యాచరణ తయారు చేశామన్నారు.  వాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసామని, రాబోయే రోజుల్లో విద్యార్ధులకు కూడా వాక్సినేషన్  అవకాశం వస్తే వెంటనే  ప్రారంభిస్తామని  అన్నారు.   కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  ప్రభుత్వ  ఆలోచనకు ప్రజల సహకారం తోడైతే థర్డ్ వేవ్ ను సమర్ధంగా ఎదుర్కోగలమని ఆశా  భావం వ్యక్తం చేసారు. 

కోవిడ్  నిబంధనలను పటిష్టంగా  అమలు జరిగేలా చూస్తామని జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ తెలిపారు.   మొదటి, రెండవ దశలలో నిబంధనలను ఉల్లంఘించిన వారి పై కేసు లు పెట్టడం జరిగిందని , మూడవ దశ లో ఎలాంటి ఉపేక్ష లేకుండా మరింత కట్టు దిట్టంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.   మాస్క్ ధరించని వారిపైన, భౌతిక దూరాన్ని పాటించని వారిపై కఠినంగా  ఉంటామని హెచ్చరించారు.  మూడవ దశ లో  నిబంధనలను ఉల్లంఘించిన వారి పై అపరాధాన్ని ఎక్కువగా విధించడం జరుగుతుందని, కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.