కోర్టు ఆదేశాలు అమలు చేయాలి..


Ens Balu
4
Vizianagaram
2021-07-13 10:56:30

వివిధ కేసుల‌కు సంబంధించి కోర్టులు ఇస్తున్న ఆదేశాల‌ను, సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌లు అమ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. ప్ర‌తీశాఖ‌లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని సూచించారు. వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ స‌మావేశ‌మందిరంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో, ప‌లు అంశాల‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. వివిధ ప్ర‌భుత్వ‌ శాఖ‌ల ప‌రంగా కోర్టు కేసుల‌కు సంబంధించి క‌లెక్ట‌ర్ స‌మీక్షిస్తూ, న్యాయ‌స్థానం ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని, అమ‌లు చేయ‌లేని ప‌క్షంలో సంబంధిత ప్ర‌భుత్వ న్యాయ‌వాది ద్వారా కోర్టుకు కార‌ణాల‌ను తెలియ‌జేయాల‌ని సూచించారు. కోర్టు ఉల్లంఘ‌న‌కు సంబంధించిన కేసుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించి, న్యాయ‌ప‌రంగా త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. అన్ని శాఖ‌ల్లోనూ కోర్టు కేసుల‌ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండి, నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌గిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. కోర్టు కేసుల విష‌యంలో సక్ర‌మంగా, స‌కాలంలో స్పందించ‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూకి సంబంధించిన కేసుల‌పై జిల్లా రెవెన్యూ అధికారిని, రెవెన్యూ యేత‌ర కేసుల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం)ని ముందుగా సంప్ర‌దించి, వారి స‌ల‌హా ప్ర‌కారం న్యాయ‌ప‌రంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

             ప్ర‌భుత్వ శాఖ‌లన్నీ, బ్యాంకుల్లో ఉంచిన త‌మ‌ డిపాజిట్ల వివ‌రాలు వెంట‌నే అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఏయే బ్యాంకుల్లో ఎంత డిపాజిట్ ఉన్న‌దీ, అది ఏ రూపంలో ఉన్న‌దీ, వ‌డ్డీ ద్వారా వ‌చ్చిన ఆదాయం త‌దిత‌ర వివ‌రాల‌ను నిర్ణీత న‌మూనాలో నింపి, మంగ‌ళ‌వారం సాయంత్రానికి అంద‌జేయాల‌ని సూచించారు. ప్ర‌తీ ప్ర‌భుత్వ కార్యాల‌యంలో కోవిడ్-19 నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిసరిగా అమ‌లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ అన్నారు.  కోవిడ్‌కు సంబంధించి, వివిధ శాఖ‌ల‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌తీఒక్క‌రూ మాస్కును ధ‌రించేలా చూడాల‌ని, ధ‌రించ‌క‌పోతే రూ.100 జ‌రిమానా విధించ‌డం జరుగుతుంద‌ని హెచ్చ‌రించారు. ముఖ్యంగా కోవిడ్ మూడోద‌శ ప‌ట్ల అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌క‌పోతే, తీవ్ర‌మైన న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని,  ప్ర‌జ‌లంతా స్వీయ నియంత్ర‌ణ పాటించేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

             ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, వివిధ శాఖ‌ల అధికారులు, ఏఓలు, సూప‌రింటిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.