పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్ నిర్మాణ పనులు వేగంగా జరుగు తున్నాయని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ప్రాజెక్టు టన్నెల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. నిర్మిస్తున్న 1, 2 టన్నెల్ సొరంగంలోకి వెళ్లి ఆయన నిశితంగా పరిశీలించారు. ప్రతిరోజు నాలుగు మీటర్ల తక్కువ కాకుండా టన్నెల్ నిర్మాణం జరగాలన్నారు. అనంతరం పెద్దారవీడు మండలంలోని గొట్టిపడియ, సుంకేసుల గ్యాప్ వద్ద 80 మీటర్ల ఎత్తులో నిర్మించిన రిజర్వాయర్ గోడ మీదకు వెళ్లి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. రిజర్వాయర్ లో నీరు నిల్వ చేసే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పనులలో భాగంగా తూర్పు ప్రధాన కాల్వ వద్ద నిర్మించనున్న ఎత్తిపోతల పథకాలను ఆయన పరిశీలించారు. ఆయకట్టు భూములు సుంకేసుల రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తొలుత దోర్నాల వద్దనే అధికారులతో ఆయన సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరలో పూర్తి కానుందని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తికాగానే 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందన్నారు.
మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.8,080 కోట్ల నిధులు కేటాయించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.ఆరు వేల కోట్లు ప్రాజెక్టుకు వచ్చాయన్నారు. కేవలం రూ.1,230 కోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ల కింద ఖర్చు చేస్తున్నట్లు ప్రాజెక్టుల ఎస్ ఈ కలెక్టర్ కు వివరించారు. ప్రాజెక్టుతో 4.4 7 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందనున్నదని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్టేజ్-1 కింద 1.20 లక్షల ఎకరాలకు, స్టేజ్-2 కింద 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన వివరించారు. సుంకేసుల నుంచి తీగలేరు కెనాల్ కు నీరు తరలించడం ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఈ పనులు 70 శాతం పూర్తయిందన్నారు.
బచావో ట్రిబ్యునల్ నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాల మేరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 840 అడుగుల ఎత్తులో నీరు నిల్వ ఉన్న నీటిని తరలించడానికి అనుమతులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఒప్పందాల మేరకు గుత్తేదారులు నిర్మాణ పనులు చేస్తున్నారన్నారు. టి-5 బ్లాక్ వద్ద తీగలేరు కెనాల్ పనులు 54 శాతం ముగిశాయన్నారు. 74 పనులకుగాను 27 పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంపై ఆయన ఆరా తీశారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయన్నారు. రిజర్వాయర్ నుంచి తూర్పు ప్రధాన కాల్వల వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణంపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతంమొదటి టన్నెల్ నిర్మాణం పూర్తికాగా, రెండవ టన్నెల్ నిర్మాణం శరవేగంగా సాగుతోందని కలెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నామని కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతులు రాగానే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ప్రాజెక్టుల ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళ వందనం, మార్కాపురం ఆర్డీఓ లక్ష్మీశివజ్యోతి, ఉప కలెక్టర్ గ్లోరియా, ఇఈ లు అబూతలీమ్, చిన్న బాబు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.