ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆహ్వానం..
Ens Balu
2
Srikakulam
2021-07-13 14:49:43
ప్రధానమంత్రి మత్స్యశాఖ సంపద యోజన పథకం(2020-21) క్రింద చేపల తలసరి వినియోగం పెంపొందించేందుకు వివిధ యూనిట్ల స్థాపనకై జిల్లాలోని ఔత్సాహిక వ్యాపారవేత్తల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన క్రింద లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటేడ్ అండ్ కుక్డ్ ప్రోడక్ట్స్ రిటైల్ అమ్మకం, స్నాక్స్, ఇన్ స్టంట్ కుకింగ్ ఫుడ్స్ తయారీ, ఆన్ లైన్ ద్వారా విక్రయాలు, వివిధ రకాల రిటైల్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కొరకు ఆసక్తి గల వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2020-21జిల్లాలో చేపల ఉత్పత్తి 1,68,870 టన్నులు కాగా, 2021-22 సం.నకు 1,70,896 టన్నులు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. జిల్లాలో చేపల తలసరి వినియోగం పెంచి, వివిధ రకాల చేపల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలుచేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం నగర కేంద్రంగా రూ.1.27 కోట్లతో ఒక ఆక్వాహబ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, క్రమేపీ ప్రతి నియోజకవర్గంలో ఒక హబ్ చొప్పున ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించడమైందని తెలిపారు. శ్రీకాకుళం పట్టణం లో అక్వా హబ్ కేంద్రంగా శ్రీకాకుళం మరియు ఆమదలవలస మున్సిపాలిటీలు మరియు శ్రీకాకుళం ఆమదాలవలస రూరల్ మండలాలు ఎచ్చెర్ల , గార, నరసన్నపేట, పోలాకి, పొందూరు గ్రామ సచివాలయాలు వెరశి మొత్తం 224 ఉండగా 77 సచివాలయాలు నుంచి మాత్రమే మినీ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ ల కొరకు ధరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ వార్డు లేదా గ్రామ వాలంటీర్ ను సంప్రదించాలని అన్నారు. అలాగే పట్టణ వార్డు,గ్రామ సచివాలయాలు వెరశి 147 సచివాలయాల నుండి దరఖాస్తులు కోరినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. రూ.50 లక్షల వ్యయంతో జిల్లాలో ఒక వాల్యూ యాడెడ్ యూనిట్, రూ.20లక్షలతో లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఐదింటిని, రూ.10 లక్షల వ్యయంతో 10 ఫిష్ కియోస్క్ యూనిట్లను, రూ.4 లక్షల వ్యయంతో 10 ఈ-వెహికల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి రూ. 1.25 లక్షలతో మినీ ఫిష్ వెండింగ్ రిటైల్ యూనిట్లను ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించగా ప్రస్తుతం 100 యూనిట్లు మంజూరుకాబడ్డాయని, 2022 నాటికి 300 యూనిట్లను ఏర్పాటు చేయుటకు ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. పై యూనిట్ల స్థాపనకు బి.సి జనరల్ కేటగిరికి 40 శాతం, ఎస్.సి, ఎస్.టి, ఉమెన్ కేటగిరీలు 60 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు. దరఖాస్తు చేసుకునేవారు https://ematsyakar.com/efisher/retailunits వెబ్ సైటును లేదా 94408 14719, 83090 54784, 93460 07766 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో వివరించారు.