శ్రీకాకుళంజిల్లాలో 1528 మంది ప్రత్యేక అవసరాల పిల్లలుగా గుర్తించడం జరిగిందని సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త యస్.తిరుమల చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీచేసారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల పిల్లల నమోదు మరియు బడిబయట పిల్లలను ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైంది. అందులో భాగంగా 06-18 సం.ల లోపు ప్రత్యేక అవసరాల గల పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో నమోదుచేయడం లక్ష్యంగా ఉందని, మార్చిలో జరిగిన సర్వేలో బడి బయట పిల్లలు 1528 మందిని గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరిలో 802 ప్రాథమిక స్థాయిలో, 726 మంది సెకండరీ స్థాయిలో గుర్తించామని, వీరందరిని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన చెప్పారు. 1528 మంది పిల్లలో 101 మంది స్వయంగా నమోదుచేసుకున్నారని, 38 మంది దివ్యాంగ పిల్లలు, 97 మంది కె.జి.బి.వి పిల్లలు, 138 మంది ఆవాస సహిత ప్రత్యేక శిక్షణ కేంద్రం పిల్లలు, 428 మంది ఆవాస రహిత ప్రత్యేక శిక్షణ కేంద్రం పిల్లలు, 726 మంది ఓపెన్ స్కూల్ పిల్లలు వెరశి 1528 మంది పిల్లలుగా గుర్తించినట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి, అదనపు పథక సమన్వయకర్త, ఉపవిద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి మరియు సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు.
ప్రత్యేక అవసరాల గల పిల్లలు సర్వే మరియు బడి బయట పిల్లలు సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, అదనపు పథక సమన్వయకర్త యస్.తిరుమల చైతన్య, సహిత విద్యా సమన్వయకర్త్లు యస్.అనురాథ, సిహెచ్.సుధాకర్, ప్రత్యామ్నాయ పాఠశాల సమన్వయకర్త డి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.