పచ్చదనం, పరిశుభ్రత ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి వాటి సాధనకోసం తమ వంతు కృషిచేస్తేనే ఆరోగ్యకర సమాజం రూపొందుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. మొక్కలు నాటేందుకు ఇదే సరైన సమయమని పేర్కొంటూ ఈ సీజనులోనే వీలైనంతగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ సమీపంలోని ఆర్ధిక శాఖల భవన సముదాయం ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ తానే స్వయంగా మొక్కలు నాటేందుకు గుణపంతో గుంతలు తవ్వి, మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. హరిత విజయనగరం సభ్యులతో కలసి ఈ ప్రాంగణంలో సుమారు వంద అలంకరణ మొక్కలు నాటారు. బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఈ మొక్కలు అందజేసింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో పచ్చదనాన్ని పెంచే మొక్కలతో పాటు ఆయా ప్రాంతాల సుందరీకరణ కోసం అలంకరణ మొక్కలు కూడా నాటుతున్నట్టు కలెక్టర్ చెప్పారు. నాటిన ప్రతి మొక్కకు రక్షణగా ట్రీ గార్డు ఏర్పాటుచేసి పదికాలాల పాటు సజీవంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో పెరిగిన కలుపు మొక్కలను, విషపూరిత మొక్కలను కలెక్టర్ హరిత విజయనగరం సభ్యులతో కలసి తొలగించే కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక అటవీ అధికారి బి.జానకిరావు, హరిత విజయనగరం కో ఆర్డినేటర్ రామ్మోహన్ రావు, డా.వెంకటేశ్వరరావు, ఏ.పి.ఇ.డబ్ల్యు.ఐ.డి.సి. కార్యనిర్వాహక ఇంజనీర్ శామ్యూల్, డి.ఇ. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.