కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 22 నుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో సర్పంచ్‌కు మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. డివిజన్ల వారీగా ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. సర్పంచుల శిక్షణా కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై, జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సర్పంచుల శిక్షణా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్ల వారీగా సుమారు వంద మంది సర్పంచ్‌లను ఒక బ్యాచ్‌గా విడదీసి, బ్యాచులవారీగా మూడురోజుల చొప్పున రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. విజయనగరం డివిజన్ పరిధిలోని సర్పంచులకు, స్థానిక మహిళా ప్రాంగణంలో, పార్వతీపురం డివిజన్ సర్పంచులకు వైటిసిలో శిక్షణ ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. వీరికి మూడు రోజులు ఉండేందుకు వీలుగా అన్ని రకాల వసతులనూ, సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబ పుస్తకాలను కూడా వారికి అందజేయాలన్నారు. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
శిక్షణ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, భోధనాపరమైన అంశాలను జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఆతిథ్యానికి సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు పర్యవేక్షిస్తారని తెలిపారు. సర్పంచులకు పాలనకు సంబంధించిన అంశాలను బోధించడమే కాకుండా, సామాజిక సేవ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఇందులో భాగంగా శిక్షణా సమయంలో సర్పంచులను చెరువుల శుద్ది, పచ్చదనం, పరిశుభ్రత మొదలగు కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. సర్పంచులు శిక్షణా కేంద్రానికి చేరుకొనేందుకు వీలుగా వాహన సౌకర్యాన్ని కూడా కల్పించాలన్నారు. శిక్షణానంతరం ప్రతీఒక్కరికీ సర్టిఫికేట్, గ్రూప్ ఫొటోను అందజేయాలని సూచించారు. శిక్షణలో కోవిడ్ నిబంధనలను పాటించడమే కాకుండా, శానిటైజర్లు, మాస్కులను అందజేయాలని, అవసరమైనవారికి కోవిడ్ వేక్సిన్‌లు వేయాలని సూచించారు. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించడంపై సర్పంచులందరికీ, నిపుణులైన వైద్యుల చేత అవగాహన కల్పించాలని డిఎంఅండ్‌హెచ్‌ను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, పార్వతీపురం సబ్‌కలెక్టర్ భావన, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, డిపిఓ సుభాషిణి, సిపిఓ జె.విజయలక్ష్మి, డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు కె.రామచంద్రరావు, రాజ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.