అర్భన్ పీహెచ్సీలను తనిఖీ చేసిన జెసి..
Ens Balu
2
Vizianagaram
2021-07-15 14:27:57
విజయనగరం అర్భన్ లో నూతనంగా నిర్మిస్తున్న పలు పట్టణ ఆరోగ్య కేంద్ర భవనాలను జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు బుధవారం తనిఖీ చేశారు. నగరంలోని గాజులరేగ, కొత్తపేట, ప్రశాంతి నగర్, ఎల్.బి.కాలనీలో నిర్మిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ భవనాలను, లంకాపట్నంలో మరమ్మత్తులు చేపడుతున్నఅర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని జె.సి. వెంకటరావు మునిసిపల్ ఇంజనీర్ కె.దిలీప్ తో కలసి పరిశీలించారు. అర్బన్ హెల్త్ సెంటర్ భవనాల నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేదీ మునిసిపల్ ఇంజనీర్‌ను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీలేకుండా ఈ భవనాలను నిర్మించాలని, భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని జె.సి. వెంకటరావు సూచించారు. మునిసిపల్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నగరంలో 7 అర్బన్ హెల్త్ సెంటర్ భవనాలను ఒక్కొక్కటి రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామని, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్ భవనాలకు ఒక్కొక్కటి రూ.10 లక్షలతో మరమ్మత్తులు చేపట్టామని మునిసిపల్ ఇంజనీర్ దిలీప్ వివరించారు. మొత్తం రూ.6 కోట్ల వ్యయంతో నగరంలో వైద్య ఆరోగ్య వసతుల మెరుగుకోసం ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గాజులరేగ, కొత్తపేట, ప్రశాంతినగర్, వి.టి.అగ్రహారం(బి.సి.కాలనీ), స్టేడియంపేట, కె.ఎల్.పురం, ఎల్.బి.కాలనీ ప్రాంతాల్లో కొత్త భవనాలు నిర్మిస్తుండగా, లంకాపట్నం, పూల్‌బాగ్ కాలనీ, విటి అగ్రహారం, రాజీవ్ నగర్‌లలో పాత అర్బన్ హెల్త్ సెంటర్ భవనాల మరమ్మత్తులు చేపడుతున్నట్టు చెప్పారు.