స్వచ్ఛ విశాఖ అందరి లక్ష్యం కావాలి..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-15 15:06:56

విశాఖను అత్యంత స్వచ్ఛంగా తీర్చిదిద్దడంలో మహావిశాఖ నగర పాలక సంస్థ ఉద్యోగులు శక్తివంచనలేకుండా శ్రమించాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి పిలుపునిచ్చారు. గురువారం జివిఎంసి సమావేశ మందిరంలో హెచ్.పి.ఎల్.సి. ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ భారత్ “ప్రతిజ్ఞ” కార్యక్రమం జివిఎంసి కమిషనర్ డా.జి. సృజన, హెచ్.పి.సి.ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నదాస్ తో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ స్వాతంత్ర సాధన తో పాటు పరిశుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని వారి కలలను మనం నెరవేర్చాలని, అందుకు ప్రతి ఒక్కరూ సంవత్సరములో వంద రోజులు, ప్రతి వారంలో రెండు గంటలు శ్రమదానం చేసి, పరిసరాల పరిశుభ్రత పాటుపడాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, తమ వీధిని పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని,  అప్పుడే మన సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. హెచ్.పి.సి.ఎల్ యాజమాన్యం వారు రూ.48లక్షలతో మల్కాపురం, శ్రీహరిపురం, గొల్లపాలెం, యారాడ ప్రాంతాలలో నిర్మించిన కంటైనర్లతో కూడిన ప్రజా మరుగుదొడ్లను మేయర్, కమిషనర్ కలసి ప్రారంభించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు హెచ్.పి.సి.ఎల్ వారు చాలా సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారని అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ,  ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారిని కోరారు. 

అనంతరం, జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ మిషన్ లో హెచ్.పి.సి.ఎల్ వారు కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు “ప్రతిజ్ఞ” కార్యక్రమంను దాదాపు 18వేల మంది యాప్ ద్వారా వీక్షించి, “ప్రతిజ్ఞ”లో పాల్గొన్నారని తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని,  ఇందుకు ప్రజల్లో పరిసరాల  పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని, స్వచ్ఛభారత్ లో జివిఎంసికి ఎన్నో ర్యాంకులు సాధించి ఉన్నాయంటే ఆ ఘనత విశాఖ ప్రజలు,  వివిధ సంస్థలు, ఆర్.డబ్ల్యూ.ఎ.ఎస్., మహిళా సంఘాలు సహకారం వల్లనే సాధ్యమైనదని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించి, గుడ్డ సంచులు ఉపయోగించాలని సూచించారు. ఎస్.ఎం.ఎస్, వాట్సాప్ ల ద్వారా, స్వచ్ఛ భారత్ పై సమాచారం పంపిన వారికి, నిమిషం పాటు ప్రసంగించిన స్కూలు పిల్లలకు, డ్రాయింగ్ తదితర కార్యక్రమాలను నిర్వహించి వారిలో పోటీతత్వం పెంపొందించి బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పరిశుభ్రతపై 8 ఆర్.టి.సి. బస్ డిపోలను పరిశీలించగా అందులో విశాఖపట్నం, వాల్తేరు, మధురవాడ, గాజువాక డిపోలను ఎంపిక చేసి బహుమతులు ఇవ్వడం జరిగినది. 

హెచ్.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ జివిఎంసి సౌజన్యంతో ప్రతి సంవత్సరము స్వచ్ఛభారత్ పక్వాడ నిర్వహించడం జరుగుతుందని, జివిఎంసి భాగస్వామితో స్వచ్ఛభారత్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, పలుచోట్ల ప్రజా మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని,   తడి-పొడి మరియు ప్రమాధకరమైన వ్యర్ధాలను వేరువేరుగా ప్రజలు ఇవ్వడం కొరకు 30 వేల మూడు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరుగుతుందని, ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని ఉద్దేశ్యంతో వాటిని పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు స్వచ్ఛత పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి,  డా. వి. సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.