ప్రజల అర్జీలు సత్వరమే పరిష్కరించాలి..


Ens Balu
2
Amaravati
2021-07-15 15:32:50

గుంటూరు నగరంలోని స్ధానిక అమరావతి రోడ్డు  44వ డివిజన్ పరిధిలో  ఉన్న 137, 138, 180 వార్డు సచివాలయాలను గురువారం ఉదయం  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత 137, 138 సచివాలయాల్లో  సిబ్బంది వారి డెస్క్ వద్ధ పేరు,  హోదాలతో కూడిన స్టిక్కర్ ను   ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్ మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పోస్టర్లు  ఏర్పాటు  చేసిన విధానాన్ని  జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్  పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను సిచివాలయ సెక్రటరీల ద్వారా కంప్యూటర్ లో నమోదు చేసిన డేటా ప్రత్యక్షంగా పరిశీలన చేశారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల జాబితాను పరిశీలించి ఎంతమంది  రోగులు సచివాలయానికి వచ్చారు. ఎంతమందికి ఎక్కడికి రెఫర్ చేశారు వంటి వివరాలను వార్డు హెల్త్ సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. బియాండ్ ఎస్ ఎల్ ఏకి వెళ్లకుండా వచ్చిన అర్జీలను ప్రతీరోజు ప్రజా సమస్యలు/ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్ ఆదేశించారు. వార్డు సచివాలయం పరిధిలో ఎంతమంది వ్యాక్సిన్ చేయించుకున్నారు, 45 సంవత్సరాల పైబడిన వారికి ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు, ఇంకా రెండవ డోస్ ఎంతమంది వేయించుకోవాలి వంటి వివరాలను జిల్లా కలెక్టర్  అడిగి తెలుసుకున్నారు. వైయస్సార్ బీమా, కాపు నేస్తం, నేతన్న నేస్తం పథకాలకు సంబంధించి సోషల్ ఆడిట్ కంప్లీట్ చేశారా లేదా అని అధికారులను ప్రశ్నించారు. వారి వివరాలను నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని వెల్ఫేర్ అసిస్టెంట్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం గోరంట్ల పరిధిలోని  సున్నం బట్టీల సెంటర్ 180 వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వెల్ఫేర్ క్యాలెండర్ డిస్ ప్లే చేశారా అని  ఆరాతీశారు. సంక్షేమ పధకాలు అమలవుతున్న తీరుని అడిగి తెలుసుకొని,  వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సచివాలయంలో మొత్తం ఎంతమంది విధులు  నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. మొత్తం 10 మంది సిబ్బంధిలో ఎనిమిది మంది విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. వార్డు రెవెన్యూ సెక్రటరీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు విధుల్లో లేకపోవడంతో ఎందుకు విధులకు హాజరుకాలేదని  జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. వార్డు రెవెన్యూ సెక్రటరీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని జ్వరం రావడంతో తహాశీల్ధార్ కు ఫోన్ ద్వారా తన అనారోగ్య సమాచారాన్ని తెలిపినట్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. సెలవు పత్రాన్ని ఇవ్వకపోవడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని  ఆదేశిస్తూ  రిజస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. వార్డు ఉమెన్ ఫ్రొటెక్షన్ సెక్రటరీ కార్యాలయంలో లేరు కానీ తన విధుల మూమెంట్ రిజిష్ట్రర్ లో నల్లపాడులో శిక్షణకు వెళుతున్నట్లు రాసిఉండటాన్ని జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు. ప్రజలకు అందించే సేవలు, ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు విషయంలో అలసత్వంగా ఉండవద్దని హితవు పలికారు.  ప్రభుత్వం జారీచేసిన నిర్ణీత సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ఏ విభాగంలోనూ పనులు పెండింగ్ లో ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక కమీషనర్ చల్లా అనురాధ, డిప్యూటి కమీషనర్ శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య, 44 వ డివిజన్ కార్పోరేటర్ వి.హేమలత, సాంకేతిక వ్యవస్థ జిల్లా అధికారి కె.వి. రత్నం, వార్డు  సచివాలయాల సెక్రటరీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.