జాబ్ మేళాలో 500 మందికి ఉద్యోగాలు..
Ens Balu
1
Vizianagaram
2021-07-16 14:58:08
విజయనగరం టిటిడిసి వద్ద డిఆర్‌డిఏ నిర్వహించిన మెగా జాబ్‌మేళా విజయవంతమయ్యింది. శుక్రవారం నిర్వహించిన ఈ మేళాలో జిల్లాకు చెందిన సుమారు 500 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. డిఆర్‌డిఏ ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో తిరుపతికి చెందిన అమెరాన్ బ్యాటరీస్ సంస్థ, తమ సంస్థలో పనిచేసేందుకు 500 మందిని ఎంపిక చేసింది. ఐటిఐ ఉత్తీర్ణులతోపాటుగా, కేవలం పదోతరగతి, ఇంటర్ అర్హత ఉన్నవారిని కూడా ఉద్యోగాలకు తీసుకున్నారు. వీరికి ప్రారంభ వేతనం రూ.10,800గా నిర్ణయించారు. వారి ప్రతిభను బట్టి కొద్దికాలంలోనే వేతనాలను పెంచుతారు. ఇపిఎఫ్, ఇఎస్ఐ సౌకర్యంతోపాటుగా, సబ్సిడీపై భోజనం, వసతిని కూడా కల్పించనున్నారు. మేళాకు జిల్లా నలుమూలనుంచి 580 మంది రాగా, వీరిలో 86 శాతం మందికి పైగా ఉద్యోగాలను సాధించడం విశేషం. ఉద్యోగాలకు ఎంపికైన వారంతా కష్టపడి పనిచేసి, జిల్లాకు మంచి పేరు తేవాలని జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు కోరారు. జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎక్కడైనా కష్టపడిన వారికే మంచి పేరుతోపాటు, అభివృద్దీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాము కూడా చాలాకష్టపడి ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. అంకితభావం, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లానుంచి ఇంతకుముందు కూడా చాలామంది ఈ కంపెనీకి ఇదేస్థాయిలో ఎంపికై, ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తూ, ఉన్నత స్థానానికి చేరుకున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని జెసి కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్, ఏపిడి సావిత్రి, ఆర్‌సెట్ డైరెక్టర్ వేణుగోపాల్, జెడిఎం(జాబ్స్) బి.శ్రీనివాసరావు, అమెరాన్ బేటరీస్ హెచ్ఆర్ మేనేజర్ కల్యాణ్, వెలుగు, డిఆర్‌డిఏ ఏరియా కో-ఆర్డినేటర్లు, ఎపిఎంలు, డిపిఎంలు పాల్గొన్నారు.