శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజక వర్గంలోని జగనన్న కాలనీల్లో చేపడుతున్నఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని, ఇల్లు నిర్మాణాల్లో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ ఆకాంక్షించారు. శుక్రవారం ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో ఏర్పాటుచేసిన పలు అభివృద్ధి పథకాలకు శాసన సభాపతి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపనలు చేశారు. తొలుత తోలాపి గ్రామంలోని జగనన్న కాలనీలో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అలమాజీపేట గ్రామంలో సుమారు 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం జగనన్న పచ్చతోరణం - వనహారం కార్యక్రమంలో భాగంగా రాపాక నుండి కుమ్మరి కాలననీ వరకు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలోనూ, పొందూరు ఎంపీడీవో కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొందూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శాసన సభాపతి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందని చెప్పారు. ఇటువంటి పరిపాలన చరిత్రలో మునుపెన్నడూ లేదని గుర్తుచేసారు. ప్రతీ సంక్షేమ పథకం నేరుగా లబ్ధిదారునికే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అందువలనే ప్రతి పథకం విజయవంతం అయిందని సభాపతి అభిప్రాయపడ్డారు. ఆమదాలవలస నియోజకవర్గంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను కోరిన ఆయన ఇళ్ల నిర్మాణంలో ఆమదాలవలస నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర వెనకబడిందని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరిగేషన్లో జిల్లాకు పెద్దపీట వేసారని చెప్పారు. మడ్డువలస ప్రోజెక్ట్ కోసం అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించి సుమారు 30 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా సుమారు 75 వేల ఎకరాలకు లబ్ధి చేకూరనుందని అన్నారు. నేరేడు బ్యారేజీకి సాంకేతికపరమైన అడ్డంకులు తొలగించుకుని పనులు ప్రారంభించబోతున్నామని, అది పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని సభాపతి ఆశాభావం వ్యక్తం చేసారు. మన ముఖ్యమంత్రి అపర భగీరధుడని అని శాసనసభాపతి ఈ సందర్భంగా కొనియాడారు. మునుపెన్నడు మన ఉత్తరాంధ్రని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, వెనుకబడిన జిల్లాగా విడిచి పెట్టారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఒక వరంలా నాటి ముఖ్యమంత్రి దివంగత వై.యస్.రాజశేఖర్ రెడ్డి అందిస్తే ఈ వేళ ఆ పోలవరాన్ని పూర్తి చేసి జగన్మోహన్రెడ్డి అపర భగీరధుడు అయ్యారని గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో పొందూరు మండల తహశీల్ధారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, కొంచాడ రమణమూర్తి , గాడు నాగరాజు, పప్పల వెంకటరమణ, జడ్పిటిసి అభ్యర్థి లోలుగు కాంతారావు, లోలుగు శ్రీరాములు నాయుడు, గంట్యాడ రమేష్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.