అనాధ బాలలకు ఉచిత వసతి గ్రుహాలు..
Ens Balu
2
Vizianagaram
2021-07-19 12:58:41
అనాధ బాలురు, తల్లి, లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలు, వీధి బాలురు, యాచక బాలుర కోసం నిర్వహిస్తున్న అణగారిన పిల్లల హాస్టల్ సేవలను, అవసరమైనవారు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. సమగ్ర శిక్ష, ఐ.ఆర్.పి.డబ్ల్యు.ఏ. సంస్థ ఆధ్వర్యంలో, స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్ సమీపంలో నిర్వహిస్తున్న అణగారిన పిల్లల హాస్టల్ కు సంబంధించిన గోడ పత్రికను, కలెక్టరేట్ ఆడిటోరియంలో, సోమవారం కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆవిష్కరించారు. ఈ హాస్టల్ పట్ల అవగాహన కల్పించి, అణగారిన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలని, ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అవసరం అయిన వారంతా సేవలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయ కర్త జె.విజయలక్ష్మి మాట్లాడుతూ, అనాధ పిల్లలకు, ఈ హాస్టల్లో వసతిని కల్పించి, 3 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, నైపుణ్యాభివృద్ధి కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ హాస్టల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, అవసరమైన వారిని చేర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(సంక్షేమం) జె.వెంకటరావు, డిఆర్వో ఎం.గణపతిరావు, సోషల్ వెల్ఫేర్ డిడి కె.సునీల్ రాజ్ కుమార్, డి.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్ ఎస్వీ రమణ కుమారి, ఏ.ఎల్.ఎస్. కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, ఐ.ఆర్.పి.డబ్ల్యూ.ఏ. డైరెక్టర్ కె.ప్రకాష్, యు.ఆర్.హెచ్. సిబ్బంది రామకృష్ణ, శ్రీనివాస్, భానుమూర్తి, విమల తదితరులు పాల్గొన్నారు.