ప్రతి ప్రభుత్వోద్యోగి కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పటివరకు వేయించుకోని ఉద్యోగులతో వ్యాక్సిన్ వేయించే బాధ్యత ఆయా జిల్లా అధికారులదేనని స్పష్టంచేశారు. వ్యాక్సిన్ తోనే కోవిడ్ నుంచి మనకు రక్షణ లభిస్తుందని, నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి వుండే ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా తమకు రక్షణ కల్పించుకోవడంతోపాటు తమ కుటుంబానికి కూడా రక్షణ కల్పించినట్లవుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో స్పందన వినతుల స్వీకరణ సందర్భంగా సోమవారం డి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో మాస్క్‌లపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను, పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ 45 ఏళ్ల లోపు వయస్సుగల ఉద్యోగులకు కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి వ్యాక్సిన్ వేస్తారని చెప్పారు. ఏ ప్రభుత్వ శాఖకు చెందిన ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకొనేందుకు వచ్చినా వ్యాక్సిన్ వేసేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి ఆదేశాలివ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.రమణకుమారికి సూచించారు. గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన ఇద్దరు సిబ్బంది తాము ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోనట్లు తెలుపగా వారిద్దరికీ తక్షణమే వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ సూచించారు. వ్యాధి సోకిన తర్వాత ఇబ్బందులు పడే కంటే వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడమే మేలైన విధానమని చెప్పారు. మాస్క్ ధరించడం, శానిటైజేషన్, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మూడో వేవ్ రాకుండా నిరోధించగలమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొనడం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించగలమన్నారు.
జిల్లాలో కోవిడ్ కేసులు అధికంగా వున్న మండలాల ప్రత్యేకాధికారులు పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల్లో జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. గజపతినగరం, ఎల్.కోట, గరివిడి, కొత్తవలస, బొండపల్లి, ఎస్.కోట, తెర్లాం మండలాల్లో యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయని, ఈ మండలాల అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కెంగువ, వెలగవలస, దత్తిరాజేరు, కోనూరు, ఎస్.కోట, కొంపంగి, నగరంలోని కె.ఎల్.పురం సచివాలయాల పరిధిలో కేసులు అధికంగా వున్నాయని, ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా పంచాయతీ అధికారి, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ., మునిసిపల్ కమిషనర్‌లు చర్యలు చేపట్టాలన్నారు. డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ సునీల్ రాజ్ కుమార్, సిపిఓ విజయలక్ష్మీ, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, హౌసింగ్ పి.డి. ఎస్.వి.రమణమూర్తి, డి.ఇ.ఓ. నాగమణి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.