స్పందన వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువు దాటకముందే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా హరిజవహర్ లాల్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను చదివి వినిపించి వాటి రేపటిలోగా వాటికి పరిష్కారం చూపాలన్నారు. కోవిడ్ రెండో వేవ్ కారణంగా గత రెండు నెలలుగా స్పందన వినతులు స్వీకరించే కార్యక్రమం నేరుగా చేపట్టకపోవడంతో సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ సెల్‌కు పెద్ద ఎత్తున అర్జీదారులు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచే పదుల సంఖ్యలో అర్జీదారులు ఆడిటోరియం వెలుపల వినతిపత్రాలతో సిద్ధంగా వేచి వున్నారు. జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, జిల్లా రెవిన్యూ అధికారి డా.ఎం.గణపతిరావు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు మేనేజర్ పద్మావతి తదితరులు వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 382 మంది అర్జీదారులు వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. ఆయా సమస్యల పరిష్కారం నిమిత్తం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు సంబంధిత శాఖల అధికారులకు ఆ వినతులను పంపించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ సునీల్ రాజ్ కుమార్, సిపిఓ విజయలక్ష్మీ, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, హౌసింగ్ పి.డి. ఎస్.వి.రమణమూర్తి, డి.ఇ.ఓ. నాగమణి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.