తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం హోటళ్ల నిర్వాహకులు, ఆస్థానమండపంలో స్థానికులు, దుకాణాల వ్యాపారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్ల నిర్వాహకుల సమావేశంలో అదనపు ఈవో మాట్లాడుతూ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన భోజనం అందించేందుకు తిరుమలలోని 15 ప్రాంతాల్లో లాభాపేక్ష లేకుండా హోటళ్లు నిర్వహించేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. అన్ని హోటళ్లలో ధరల పట్టికలు కనిపించేలా ఏర్పాటుచేయాలని, కంప్యూటరైజ్డ్ బిల్ ఇవ్వాలని, డిజిటల్ చెల్లింపులను అనుమతించాలని, పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండాలని సూచించారు. హోటళ్లు, దుకాణాల్లో అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. లీజు పొందినవారు సబ్‌లీజుకు ఇవ్వరాదన్నారు. సేకరణకు వీలుగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలన్నారు.
ఆస్థానమండపంలో అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలలోని దుకాణాలు, హాకర్ లైసెన్సులు, బాలాజినగర్‌లోని ఇళ్లను కొంతమంది అనధికారికంగా పొందినట్లు సమాచారం ఉందని, కావున ప్రతి లైసెన్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి సక్రమంగా ఉన్నవారికి ఫొటో గుర్తింపుకార్డు మంజూరు చేస్తామన్నారు. స్థానికుల వివరాలన్నింటినీ కంప్యూటర్‌లో నమోదు చేస్తామని తెలిపారు. అలిపిరి చెక్‌పాయింట్ వద్ద భక్తులతో కలిసి చెక్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందని స్థానికులు విజ్ఞప్తి చేశారని, వీరికోసం ప్రత్యేక వరుస ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థానికులు పలు సమస్యలు తెలియజేశారని, తన పరిధిలో ఉన్నవాటిని వెంటనే పరిష్కరిస్తానని, మిగతా సమస్యలను ఈవో దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకెళతామని వివరించారు. ఈ సమావేశాల్లో టిటిడి ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, డెప్యూటీ ఈవో విజయసారథి, విజివో బాలిరెడ్డి, హోటళ్ల నిర్వాహకులు, దుకాణాల వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు.