కాటేజీలను పరిశుభ్రంగా ఉంచాలి..
Ens Balu
2
Tirumala
2021-07-19 14:54:29
తిరుమలలోని కాటేజీలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతంలోని పలు కాటేజీలను సోమవారం అదనపు ఈవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ప్రతి కాటేజీలో చెక్‌లిస్టు రూపొందించాలని, తద్వారా యాత్రికులకు కేటాయించే సమయంలో సివిల్, ఎలక్ట్రికల్ వసతులతోపాటు పరిశుభ్రతాచర్యలు చక్కగా ఉండేలా చూడాలని సూచించారు. కాటేజీలకు వార్షిక నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుని ఎప్పటికప్పుడు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. గదుల్లో ఉన్న సోఫాలు, టీపాయ్‌లు, టాయ్‌లెట్లను పరిశీలించారు. స్నానపుగదుల్లో చక్కటి సువాసన వచ్చేలా, కాటేజీ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గదుల లోపల లీకేజీలను అరికట్టాలని, అక్కడక్కడ విరిగిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సుందరంగా ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలన్నారు. అదనపు ఈవో వెంట టిటిడి వసతికల్పన విభాగం డెప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, డిఎఫ్‌వో చంద్రశేఖర్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇఇలు శ్రీహరి, మల్లికార్జునప్రసాద్ తదితరులు ఉన్నారు.