పల్లెల ప్రగతికి సీఎం జగన్ శ్రీకారం..


Ens Balu
3
Srikakulam
2021-07-19 15:08:39

పల్లెల ప్రగతికి రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో మంచి మనసుతో శ్రీకారం చుట్టారని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జ మండలం గుత్తావల్లి గ్రామంలో పలు అభివృద్ధి  పనులకు సోమవారం స్పీకర్ శంకుస్థాపన చేసారు. అంతకుముందు హరిత వన హారం (జగనన్న పచ్చతోరణం)లో భాగంగా లాభం నుండి గుత్తావల్లి వెళ్ళే రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. గుత్తావల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. బల్క్ మిల్క్ కూలింగ్  సెంటర్ కు,  జగనన్న కాలనీలో  ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పాలనా వ్యవస్థకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి జీవం పోస్తున్నారన్నారు. ప్రతి రెండు  వేల జనాభాకు ఒక క్లస్టర్ గా ఏర్పాటు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చారని పేర్కొన్నారు. సచివాలయంతోపాటు రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ప్రజలకు దగ్గరగా పాలనను తీసుకు వచ్చిన వ్యక్తి జగన్ అన్నారు.  ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరును నియమించి ప్రజలకు పాలనా వ్యవస్థను అందుబాటులో ఉంచిన ఘనత దేశంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. 

జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే అవినీతిలేని పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి సుపరిపాలనకు నాంది పలికారని అన్నారు.  ముఖ్యమంత్రి ప్రగతి రథ సాధకుడని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.  వై.యస్. జగన్ మోహన్ రెడ్డి  నగదు బదిలీ (క్యాష్ ట్రాన్స్ఫర్) విధానం ద్వారా అవినీతి లేని పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. విజ్ఞానవంతమై సమాజ నిర్మాణంలో వ్యవసాయదారుడు నిలబడాలని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు అందించి అధునాతన వ్యవసాయ పద్ధతుల ద్వారా నిలదొక్కుకునే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వివరించారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపించాలని కలలు కన్న ముఖ్య మంత్రి అన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని, వై.యస్.ఆర్ యంత్ర సేవ ద్వారా ఆధునిక పరికరాలు అందుబాటులో జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 150 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని స్పీకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్ధానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.