రైతుకు సాగునీరు అందించే దిశగా పనిచేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ ఇంజనీర్లతో పలాస మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సోమ వరం సమీక్షించారు. నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మందస మండలంలో ఉన్న డబారుసింగి, కళింగదల్, దామోదర సాగర్, సంకుజోడి రిజర్వాయర్లు ఆధునీకరణ పనులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగు నీరు అందించాలని అందుకు రిజర్వాయర్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేసారు. రిజర్వాయర్ల మరమ్మతులు పూర్తి చేయకుండా నీరు అందించే పరిస్థితి లేదని, ఎటువంటి జాప్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు. నీటి కాలువలు, లింక్ ఛానళ్ళు మరమ్మత్తులు చేపడితే శివారు రైతుకు నీరు అందుతుందని అందుకు తగిన కార్యాచరణ తయారు చేయాలని ఆయన సూచించారు. వంశధార కాలువల నుండి నీరు శివారు ప్రాంతాలకు అందేలా చూడాలని అన్నారు. వంశధార కాలువ ద్వారా వచ్చిన నీటిని ప్రతి చెరువులో నింపగలిగితే రైతుకు సాగు నీరు అందించ వచ్చని మంత్రి పేర్కొన్నారు.
రైతుకు సాగు నీరు అందించే లక్ష్యంతో పని చేయాలని ఆయన కోరారు. రిజర్వాయర్లు, మినీ రిజర్వాయర్లు మరమ్మత్తు పనులు పూర్తి చేయడం వలన నీటి నిలువ పెంచాలని అన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులు ఎన్ని సంక్షేమ పధకాలు అందించినా సాగునీరు అందించకపోతే రైతు పరిస్థితి దయనీయంగా మారే పరిస్ధితి ఉంటుందని అన్నారు. సమృద్ధిగా పంటలు పండాలని అందుకు తగిన నీటి వనరులు ఏడాది పొడవునా అందే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యంగా చెరువుల్లో సమృద్దిగా నీటి నిల్వలు ఉండాలని కోరారు. అందుకు తగిన విధంగా ఇంజనీర్లు మంచి ప్రణాళికలతో పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరు సుధాకర్, కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీనివాసులు, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు రమేష్, సహాయ ఇంజనీర్లు శ్రీనివాసరావు, పాణిగ్రాహి, మధు పాల్గొన్నారు.