పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కెటి రహదారి విస్తరణ పనులను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సోమ వారం పరిశీలించారు. కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి నుండి పలాస ఇందిరా చౌక్ వరకు రోడ్డు పనులు పరిశీలించారు. మంత్రి స్వయంగా కాలి నడకన నడుచుకుంటూ దుకాణదారులతో మాట్లాడుతూ పనులను పరిశీలించడం గమనార్హం. రహదారి విస్తరణ పనులకు సహకరిస్తున్న వ్యాపారస్తులకు, ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేసారు. కెటి రహదారికి ఇరువైపులా నిబంధనలను అనుసరిస్తూ పనులు జరుగుతున్నట్లు గమనించారు. 80 అడుగుల విస్తీర్ణంతో కెటి రహదారి ఆధునీకరణ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇరుకు రహదారులపై ప్రయాణిస్తున్నారని, అనేక ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని పేర్కొన్నారు. పలాస నియోజకవర్గంలో పలాస - కాశీబుగ్గ పట్టణాలు మూడు మండలాల ప్రజలకు ఎంతో అవసరమైన పట్టణం అని తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో రహదారులు అభివృద్ధి చెందితే పట్టణాన్ని సుందరంగా మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. మన పట్టణం అని అభివృద్ధి చెందే దిశగా విస్తరణ పనుల ప్రారంభం నుండి ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.
అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం కావడం శుభపరిణామం అన్నారు. పలాస నియోజకవర్గంలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలతో పాటు పలాస కాశీబుగ్గను సమూలంగా అభివృద్ధి చేసుకుని సుందర పట్టణంగా మార్చుతానని ప్రజలకు హామి ఇచ్చారు. ప్రజల నిత్యవసరాలకు నిత్యం పలాస - కాశీబుగ్గ పట్టణానికి రాకపోకలు సాగిస్తారని రహదారులు విస్తరించడం వలన ట్రాఫిక్ సమస్యల నుండి బయట పడతామని అన్నారు. రహదారికి ఇరువైపుల డ్రైనేజి, పుట్ పాత్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. డ్రైనేజి, పుట్ పాత్ పనుల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్రజలు ఎంతగా సహకరిస్తే అంత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారుల మద్దతు పూర్తిస్తాయిగా ఉందని స్వచ్చందంగా విస్తరణ పనులలో కట్టడాలను తొలిగించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బల్లా గిరిబాబు, మునిసిపల్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఎలక్ట్రికల్ సిబ్బంది స్ధానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.