మహా విశాఖపట్నం నగరపాలక సంస్థను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం చాలా అవసరమని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అన్నారు. సోమవారం ఆమె 6 వ జోన్ 75వ వార్డు గాజువాక పరిధిలోని నీలపు వీధి, ధర్మాన వీధి మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పర్యటించారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేవని, వీధులు సరిగా ఊడ్చడం లేదని, వీధుల్లో డస్ట్ బిన్లు కనిపిస్తున్నాయని, వాటిని ఇంకా తొలగించలేదని, కాలువలలో చెత్త సరిగా తీయటంలేదని ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రతీ రోజు ఇంటింటికి వచ్చి తడి-పొడి చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. త్రాగు నీరు ప్రతీ రోజు వస్తున్నదీ లేనిదీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ధర్మాన వీధి మెయిన్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు కోరగా కమిషనర్ పరిశీలిస్తామని వారికి తెలిపారు. నడుపూర్ వంతెన వద్ద సీతానగర్ లో బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తున్నారని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారిపై చర్యలు తీసుకోవాలని లో శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.ఈ పర్యటనలో ఆరవ జోనల్ కమిషనర్ శ్రీధర్, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజినీరు ప్రసాద్ బాబు, పి. శ్రీనివాస రావు, సహాయక ఇంజినీరు రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.